తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చిన ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు. పొద్దస్తమానం కులం, మతం, విద్వేషం పేరుతో రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీకి చెంప ఛెళ్లు మనిపించేలా తీర్పు ఇచ్చారని ఇందుకు ప్రతి ఒక్కరిని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు.
శనివారం ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఎన్నికలకు ముందు బజరంగ్ దళ్ అన్నారని, ఆ తర్వాత ది కేరళ స్టోరీ మూవీని ముందుకు తీసుకు వచ్చారని ఇవేవీ కర్ణాటక ప్రజలను ఆకట్టుకోలేక పోయాయని, చివరకు వారు తొవ్వుకున్న గోతిలో వారే పడ్డారని పేర్కొన్నారు.
చిల్లర రాజకీయాలను ప్రజలు హర్షించరని, ఏదైనా ఆహ్లాదకరమైన వాతావరణంలో రాజకీయాలు ఉండాలని కానీ విద్వేషం ప్రాతిపదికగా ప్రజలను రెచ్చగొట్టాలని అనుకోవడం, ఆపై ఓట్లు పొందాలని అనుకోవడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఈ విజయంతో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని కర్ణాటక ప్రజలు నిరూపించారని వారిని తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. ఇదే సమయంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి కంగ్రాట్స్ కూడా తెలిపారు మంత్రి కేటీఆర్.