న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకాల్లో ‘ప్రభుత్వ జోక్యం’పై ఆందోళన వ్యక్తం చేశారు జస్టిస్ సంజయ్ కౌల్ . పీఎంఎల్ఏ కేసులో ఒక తీర్పు లోని కొన్ని అంశాలను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎటువంటి సంప్రదింపులు లేకుండానే ఆ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయడం అత్యంత ఆందోళనకరమైన విషయమని జస్టిస్ కౌల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఇంకా విడుదల కాని తన జ్ఞాపకాల పుస్తకంలో (మెమోయిర్) పేర్కొన్న అంశాలను ఉటంకించారు. మోదీ ప్రభుత్వ హయాంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన ఈ వ్యవస్థ, అధికారంలో ఉన్నవారి ఒత్తిళ్లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ ఒక మీడియా కథనాన్ని పంచుకున్నారు. అందులో జస్టిస్ కౌల్ రాసిన ‘వితౌట్ ఫియర్ ఆఫ్ ఫేవర్’ అనే పుస్తకంలోని ముసాయిదాను ఉటంకిస్తూ, న్యాయమూర్తుల నియామకాల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ప్రభుత్వానికి అతిగా లొంగి వ్యవహరించారని పేర్కొన్నారు.
జస్టిస్ కౌల్ పలు ఆందోళనకరమైన ఘటనలను ప్రస్తావించారు: న్యాయమూర్తుల నియామకాల్లో ప్రభుత్వ జోక్యం, కొలీజియం సమావేశాలకు ముందే ప్రభుత్వ ఆమోదం పొందడానికి ప్రయత్నించడం, మైనారిటీ వర్గానికి చెందిన ఒక న్యాయమూర్తి కులం గురించి ప్రభుత్వం అసంబద్ధమైన ప్రశ్నలు అడగడం వంటివి ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా, పీఎంఎల్ఏ ( – మనీలాండరింగ్ నిరోధక చట్టం) కేసులో ఒక తీర్పులోని కొన్ని అంశాలను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయ పడినప్పుడు, ఎటువంటి సంప్రదింపులు లేకుండానే ఆ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయడం అత్యంత తీవ్రమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఇది సుప్రీంకోర్టు పనితీరులో ప్రభుత్వం ఏ స్థాయిలో జోక్యం చేసుకుంటుందో తెలియ జేస్తోంది అని జైరాం రమేష్ అన్నారు. న్యాయమూర్తుల నియామకాల కోసం ప్రభుత్వ ఆమోదం పొందాల్సిన ఒత్తిడి ఉన్నప్పుడు, సున్నితమైన కేసులను విచారించే ధర్మాసనాలను మార్చి వేసినప్పుడు… ప్రజాస్వామ్యాన్ని కాపాడే దృష్ట్యా మనం ఒక ప్రశ్న అడగాలి: ఇది న్యాయవ్యవస్థపై ఒత్తిడి కాకపోతే, దాని స్వతంత్రత దెబ్బతినడం కాకపోతే, మరి ఇంకేమిటి? అని ఆయన ప్రశ్నించారు.
