Congress : ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ లో చేరిన భజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్
కాంగ్రెస్‌లో చేరడానికి ముందు రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఇండియన్ రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు...
Congress : హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచుసుకుంది. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఇద్దరు రెజ్లర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 4న రాహుల్ గాంధీని ఈ రెజ్లర్లు ఇద్దరూ ఢిల్లీలో కలిశారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో(Congress) చేరబోతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరారు. హర్యానా ఎన్నికల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ వీరిద్దరినీ పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని జాట్ సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ ఇద్దరు రెజ్లర్లు పార్టీలో చేరడం ద్వారా ఆ సామాజిక వర్గంలో ఆదరణ పెరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
Vinesh Phogat, Bajrang Punia Joined in Congress
కాంగ్రెస్‌లో చేరడానికి ముందు రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఇండియన్ రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జీవితంలో కీలకమైన ఈ దశలో రైల్వే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని, తన రాజీనామాను సంబంధిత రైల్వే అధికారులకు అందజేశానని, దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన రైల్వే శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో ఆమె క్రీడాకోటాలో పొందిన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్(Congress)లో చేరిన తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఇద్దరు క్రీడాకారులు కాంగ్రెస్‌లో చేరడం తమకు ఎంతో గర్వ కారణమన్నారు. ఇదో గొప్ప రోజుగా చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. వినేష్ ఫొగట్ రెజ్లర్ల కుటుంబానికి చెందిన మహిళ అని.. ఆమెకు 9 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె ముందే తన తండ్రిని కాల్చి చంపారన్నారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఓ మహిళ ఎంతో ధైర్యంగా ముందుకు అడుగులు వేశారన్నారు. రెజ్లర్లకు జరిగిన అన్యాయంపై గొంతు విప్పడమే కాకుండ.. రైతులు, అగ్నివీర్ల కోసం ఈ ఇద్దరు క్రీడాకారులు తమ గొంతు వినిపించారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇది సమాజం పట్ల వారికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందన్నారు.
Also Read : Vijayawada Floods : బుడమేరులో కొనసాగుతున్న వరద ఉద్రిక్తత