Delhi Elections 2025 : ఢిల్లీ ప్రజలకు 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామంటున్న కాంగ్రెస్
జనవరి 6న 'ప్యారీ దీదీ యోజన'ను ఆ పార్టీ ప్రారంభించింది...
Delhi Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించడంతో ప్రధాన పార్టీలన్నీ హామీలతో దూసుకు వెళ్తున్నాయి. ప్రధానంగా మహిళలకు ఆర్థిక సహాయం, వృద్ధులకు ఉచిత ఆరోగ్యం స్కీమ్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ(Congress) ‘జీవన్ రక్షా యోజన’ స్కీమ్‌ను బుధవారంనాడు ప్రారంభించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే ఈ పథకం కింద రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ(Delhi) ప్రజలకు ఇచ్చిన రెండో వాగ్దానమిది. జనవరి 6న ‘ప్యారీ దీదీ యోజన’ను ఆ పార్టీ ప్రారంభించింది. ఈ పథకం కింద ఢిల్లీలోని మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. తాజాగా రెండో స్కీ్మ్ను ప్రకటిస్తూ, అధికారంలోకి రాగానే రెండు పథకాలను అమలు చేస్తామని తెలిపింది.
Delhi Elections 2025 Updates
జీవన్రక్షా యోజన పథకాన్ని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రారంభిస్తూ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ పథకాన్ని చేర్చాలని పార్టీ నిర్ణయించిందని అన్నారు. ఈ పథకం కింద రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పిస్తామని, రాజస్థాన్‌లోనూ ఇదే తరహా పథకాన్ని తాము ప్రారంభించామని చెప్పారు. ఈ పథకం కింద ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత ఆరోగ్య చికిత్స అందిస్తామని, దీనికి ఎలాంటి షరతులు, ఆంక్షలు ఉండవని చెప్పారు. రాజస్థాన్‌లోని ‘చిరంజీవి యోజన’ తరహాలో రూపొందించిన పథకం ఇదని, రాజస్థాన్‌లో ఆరోగ్య హక్కు చట్టం తెచ్చామని తెలిపారు.
ఇదొక విప్లవాత్మక పథకమని అన్నారు. జీవన్ రక్షా యోచన పథకాన్ని ఇక్కడ కూడా ప్రారంభించేందుకు తనను పిలవడం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీలో ఇదొక ‘గేమ్ ఛేంజర్’ స్కీమ్ అని, ప్రజల వద్దకు ఈ పథకాన్ని అందరూ తీసుకెళ్లాలని కోరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను జనవరి 7న ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5న పోలింగ్, ఫిబ్రవరి 8న కౌంటింగ్ ఉంటుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు 62 సీట్లను ఆప్ గెలుచుకోగా, బీజేపీ 8 సీట్లు దక్కించుకుంది. ఆప్‌కు 53.57 శాతం ఓట్లు పోలవ్వగా, బీజేపీ 38.51 శాతం ఓట్లు కైవసం చేసుకుంది.
Also Read : KTR : మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు