Kamal Haasan-Rajya Sabha : డీఎంకే పార్టీ నుంచి రాజ్యసభకు అగ్రనటుడు ‘కమల్ హాసన్’

కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు...

Kamal Haasan : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపేందుకు అధికార డీఎంకే పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారికంగా ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కమల్ హాసన్ పొత్తు పెట్టుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, రాజ్యసభలో ఒక సీటును ఎంఎన్ఎం పార్టీకి కేటాయించేందుకు డీఎంకే అంగీకరించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌ను(Kamal Haasan) రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు.

Kamal Haasan to Rajya Sabha

కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినప్పటికీ, ఆయన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే(DMK Party) నేతృత్వంలోని ఇండియా కూటమికి సపోర్ట్ చేశారు. కోయంబత్తూరు నుంచి పోటీ చేయాలని ఆలోచించినప్పటికీ, బీజేపీ అభ్యర్థి అన్నామలై పోటీ వల్ల ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు. బదులుగా, డీఎంకే తరపున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఈ సహకారానికి గుర్తింపుగా, డీఎంకే నేత స్టాలిన్ కమల్‌కు రాజ్యసభ సీటు హామీ ఇచ్చారు.

తమిళనాడులో జులై 2025లో ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ సీట్లలో నాలుగు డీఎంకే కూటమికి, రెండు అన్నాడీఎంకే కూటమికి దక్కే అవకాశం ఉంది. డీఎంకే తమ నాలుగు సీట్లలో ఒకదాన్ని కమల్ హాసన్‌కు కేటాయించింది. ఈ నిర్ణయాన్ని ఎంఎన్ఎం పార్టీ కార్యనిర్వాహక కమిటీ కూడా ఆమోదించింది. రాజ్యసభ ఎన్నికలు జూన్ 19, 2025న జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు బలమైన మెజారిటీ ఉండటంతో, కమల్ హాసన్ ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది.

డీఎంకే మంత్రి పీకే శేఖర్ బాబు ఫిబ్రవరి 2025లో కమల్ హాసన్‌ను కలిసి ఈ అంశంపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత రాజ్యసభ నామినేషన్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. ఎంఎన్ఎం ఉపాధ్యక్షుడు తంగవేల్ ఏప్రిల్ 2025లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ, కమల్ జులైలో రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని ధృవీకరించారు. మరోవైపు కమల్ హాసన్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, త్రిష, శింబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదాస్పదమయ్యాయి. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని ఆయన అనడంతో కొంతమంది విమర్శించారు.

Also Read : Vaibhav Suryavanshi : ఐపీఎల్ లో టాప్ ప్లేయర్ గా నిలిచిన ‘వైభవ్ సూర్యవంశీ’

Leave A Reply

Your Email Id will not be published!