ఖానామెట్ భూమిపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

స్పష్టత ఇచ్చిన డి. సురేష్ బాబు లీగల్ టీమ్

హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని ఖానామెట్ గ్రామంలో ఉన్న ఒక భూమికి సంబంధించి ఇటీవల జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు న్యాయ బృందం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు వారు ఒక అధికారిక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సదరు ఆస్తిపై తమకున్న చట్టబద్ధమైన హక్కుల గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ తప్పుడు సమాచారాన్ని ఏమాత్రం నమ్మవద్దని వారు విజ్ఞప్తి చేశారు.

ఖానామెట్ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 41/9 లో ఉన్న ఐదు ఎకరాల భూమికి డి. సురేష్ బాబు , ఇతరులు మాత్రమే పూర్తి స్థాయి చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారని లీగల్ టీమ్ స్పష్టం చేసింది. 1996వ సంవత్సరం నుండి ఈ భూమి ఎటువంటి వివాదాలు లేకుండా నిరంతరాయంగా, ప్రశాంతంగా తమ చట్టబద్ధమైన స్వాధీనంలోనే ఉందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా, 2002వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్.ఓ.ఆర్) జారీ చేసిందని, అప్పటినుంచే ఈ భూమిని తమ పేర్లపై మ్యూటేషన్ చేయడం ద్వారా తమ యాజమాన్యాన్ని, స్వాధీనాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించి ధృవీకరించిందని వారు గుర్తు చేశారు.

ఈ ఐదెకరాల ఆస్తిపై సురేష్ బాబు , ఇతరులకు తప్ప, మరే ఇతర వ్యక్తికీ ఎలాంటి చట్టబద్ధమైన హక్కు, యాజమాన్యం లేదా ఆసక్తి లేదని న్యాయ బృందం తేల్చిచెప్పింది. తమ యాజమాన్యాన్ని, స్థల స్వాధీనాన్ని నిర్ధారించేందుకు అవసరమైన అన్ని రకాల పక్కా రెవెన్యూ రికార్డులు, మ్యూటేషన్ నమోదు పత్రాలు , కోర్టు ఉత్తర్వులు తమ వద్ద భద్రంగా ఉన్నాయని వారు తెలిపారు. ఆస్తి యాజమాన్యం లేదా స్వాధీనం గురించి ఎవరైనా వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే, దానికి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని వారు కొట్టిపారేశారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు తెలుసు కోవాలనుకునే వారు లేదా పత్రాలను ధృవీకరించు కోవాలనుకునే వారు నేరుగా తమ న్యాయ బృందాన్ని సంప్రదించవచ్చని, వారికి అవసరమైన అన్ని రికార్డులు , చట్టపరమైన పత్రాలను చూపించడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు.

తాము ఎల్లప్పుడూ చట్టాన్ని, న్యాయస్థానాలను గౌరవిస్తామని, భవిష్యత్తులో కూడా చట్టపరమైన నిబంధనలకు , కోర్టు తీర్పులకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటామని వారు స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!