అమరావతి : ఏపీ స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపై జుగుస్సాకరంగా మాట్లాడటం దారుణమన్నారు. ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ రెడ్డి తన నేతలకు ఇలాగేనా నేర్పించేది అని ప్రశ్నించారు. మహిళల ఆత్మగౌరవం విషయంలో కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడదన్నారు. హోం మంత్రి మేకప్‌పై మాట్లాడటానికి వైసీపీ నేతలకు బుద్ధి జ్ఞానం ఉందా? అని ప్రశ్నించారు. గుడివాడ అమర్నాథ్ మహిళా కమిషన్ విచారణకు హాజరై కూడా బయటకొచ్చి నీచ వ్యాఖ్యలను సమర్థించుకుంటారా? అని నిలదీశారు. సొంత తల్లిని, తోడబుట్టిన చెల్లిని మెడబట్టి గెంటిన జగన్ రెడ్డి అండలోనే ఈ బూతులు నేర్చుకున్నారని మండిపడ్డారు సంధ్యారాణి. రాజధానిపై రోజుకో మాట మారుస్తున్న జగన్.. మా ప్రాంతంలో అయితే పిచ్చోళ్ళు అనక ఏమంటారని ప్రశ్నించారు.
దమ్ముంటే మా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయండి.. శరీరాలపై కాదని హితవు పలికారు. అధికార మదంతో అమరావతి మహిళలను ఏడిపించినందుకే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని, అయినా బుద్ది రావడం లేదన్నారు సుధారాణి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాలలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ప్రగతి పథంలో దూసుకు పోతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ వినాశకర పరిపాలన నుంచి ప్రజలు ఈ రోజు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారని మంత్రి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుధారాణి మాట్లాడారు. గతంలో వందల్లో వచ్చే ప్రజా సమస్యలు (గ్రీవెన్స్) ఇప్పుడు పదుల సంఖ్యకు తగ్గాయని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి విద్యా శాఖ మంత్రి లోకేశ్ బాబు రాష్ట్రమంతటా తిరుగుతూ సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తున్నారని చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అక్కడికక్కడే స్పందిస్తుండటం వల్లే పార్టీ ఆఫీస్‌కు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందని, ఇది ప్రభుత్వ విజయానికి నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు. ‘సూపర్ సిక్స్’ పథకాలతో పాటు అన్ని శాఖల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేక ప్రతిపక్ష ‘గొడ్డలి పార్టీ’ నేతలు సమాజంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు.
