దేశంలోనే తొలి ఆంకాలజీ తయారీ కేంద్రం హైదరాబాద్ లో
జూలై 6న ప్రారంభించనున్న సిరో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్ : భారతదేశపు మొట్ట మొదటి పూర్తిస్థాయి సమీకృత ఆంకాలజీ తయారీ కేంద్రాన్ని సిరో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం కరకపట్ల, బయోటెక్ పార్క్ ఫేజ్ IIIలో జూలై 6న సోమవారం ప్రారంభించనుంది. ఇదిలా ఉండగా సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్స్ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆరోగ్య, వైద్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా హాజరవుతారు.
కంపెనీ ప్రకారం ఈ అత్యాధునిక తయారీ కేంద్రం, అధునాతన కంటైన్‌మెంట్ టెక్నాలజీని ఉపయోగించి, నోటి ద్వారా తీసుకునే ఆంకాలజీ మందులు, స్టెరైల్ ఇంజెక్టబుల్స్, లైయోఫిలైజ్డ్ పౌడర్ ఇంజెక్షన్లు, ఆంకాలజీ సాఫ్ట్‌జెల్ క్యాప్సూల్స్‌తో సహా విస్తృత శ్రేణి ఆంకాలజీ ఫార్ములేషన్‌లను ఉత్పత్తి చేయడానికి రూపొందించారు. ఈ కేంద్రం, ఆంకాలజీ ఫార్ములేషన్ల కోసం భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి సమీకృత నిరంతర GEA తయారీ కేంద్రం. ఇది OEL లెవెల్ 5 ప్రమాణాల వరకు అత్యంత శక్తివంతమైన సైటోటాక్సిక్ ఔషధాలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. యునైటెడ్ స్టేట్స్, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా , న్యూజిలాండ్‌తో సహా నియంత్రిత అంతర్జాతీయ మార్కెట్లకు సేవలు అందించడానికి, దీనికి అధునాతన పరిశోధన , అభివృద్ధి , కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ సామర్థ్యాలు మద్దతుగా ఉన్నాయి.
ఈ కేంద్రం ఇప్పటికే WHO-GMP, PIC/S GMP, EAEU ధృవీకరణ పత్రాలను పొందింది. సిరో ఫార్మా ప్రస్తుతం 18 ఆంకాలజీ ఉత్పత్తులు, దాదాపు 20 సాఫ్ట్‌జెల్ ఫార్ములేషన్లు, అలాగే న్యూట్రాస్యూటికల్స్ , ఫుడ్ సప్లిమెంట్ల తయారీ లైసెన్సులను కలిగి ఉంది. ఈ చారిత్రాత్మక కేంద్రం భారతదేశపు ఆంకాలజీ ఫార్మాస్యూటికల్ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది . ప్రముఖ లైఫ్ సైన్సెస్ , ఫార్మాస్యూటికల్ కేంద్రంగా తెలంగాణ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది.
