మత్స్యకారుల గల్లంతుపై జగన్‌ ఆందోళన

రక్షించేందుకు చర్యలు ముమ్మరం చేయాలి

తాడేప‌ల్లి గూడెం : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు సాంకేతిక కారణాలతో తిరిగి రాక పోవడం, వారితో సంబంధాలు తెగి పోవడం బాధాకరమని ఆయన అన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత వేగంగా స్పందించి, గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాలని కోరారు. ఆదివారం ఆయ‌న సామాజిక వేదిక ద్వారా స్పందించారు.

కోస్టుగార్డు, నేవీ, మెరైన్‌ పోలీసు విభాగాల సమన్వయంతో సముద్రంలో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని వైయస్‌ జగన్‌ సూచించారు. అవసరమైతే అదనపు నౌకలు, హెలికాప్టర్లు వినియోగించి మత్స్యకారులను సురక్షితంగా గుర్తించి రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ధైర్యం చెప్పాలని, వారికి ఎప్పటికప్పుడు గాలింపు చర్యల వివరాలు తెలియ జేయాలని జగన్‌ అన్నారు. ఈ కష్ట సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ప్ర‌క‌టించారు.

విశాఖ ప్రాంత వైయస్సార్‌సీపీ నాయకులు బాధిత మత్స్యకారుల కుటుంబాలను సంప్రదించి వారికి అవసరమైన సహాయం అందించాలని, అధికారులతో సమన్వయం చేస్తూ గాలింపు చర్యల పురోగతిని తెలుసు కోవాలని జగన్‌ సూచించారు. గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!