ఏపీలో రూ. 100 కోట్ల‌తో యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు

ఏపీ ఈడీబీతో యూఏఈ అవగాహనా ఒప్పందం

అమరావతి : ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఏపీలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులను పెట్టేలా ఏపీ ఈడీబీ-యూఏఈకి చెందిన ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈమేరకు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, యూఏఈ ఆర్ధిక, పర్యాటక విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు, విదేశీ వాణిజ్యం సహా యూఏఈకి చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ఈ ఒప్పందం కుదిరింది. ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ఏపీ సచివాలయంలో సీఎంతో యూఏఈ ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఈ ఏడాది జనవరిలో దావోస్ పర్యటనలో ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆహారశుద్ధి రంగంలో ఏపీలో వ్యాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యూఏఈ నిర్ణయించింది.

ఇందుకోసం ఏపీ ప్రభుత్వం- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేస్తూ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మామిడి, అరటి, కోకో లాంటి వివిధ ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, విలువ జోడించిన ఉత్పత్తుల ఎగుమతులు, వాణిజ్యం లాంటి అంశాల్లో ఈ ఎంఓయూ సహకరించనుంది. ఈ ఒప్పందంలో తొలి అడుగుగా యూఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏపీలోని చిత్తూరులో రూ.100 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తయారు చేయనుంది. దుబాయ్, యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ దాదాపు 25 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి కూడా అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది.

Leave A Reply

Your Email Id will not be published!