ఆధునిక సాంకేతికతతో జీరో డిశ్చార్జ్ పబ్లిక్ టాయిలెట్

లుంబినీ పార్క్‌లో ఆధునిక పబ్లిక్ టాయిలెట్

హైదరాబాద్: హైదరాబాద్‌లో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు పరిశుభ్రమైన, ఆధునిక సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో లుంబిని పార్క్‌లో ఏర్పాటు చేసిన జీరో డిశ్చార్జ్ ప‌బ్లిక్ టాయిలెట్ ను మంత్రులు శ్రీ‌ధ‌ర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పబ్లిక్ టాయిలెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని తెలిపారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, రీఫ్లో సంస్థల భాగస్వామ్యంతో లుంబినీ పార్కులో ఈ ఆధునిక సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొత్త టెక్నాలజీ, అధునాతన హైజీన్ ప్రమాణాలతో రూపొందించిన ఈ టాయిలెట్‌ను ప్రజలు ఎలాంటి ఛార్జీ లేకుండా ఉచితంగా ఉపయోగించు కోవచ్చని తెలిపారు. ఇందులో వినియోగించిన నీరు, వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించే రీసైక్లింగ్ టెక్నాలజీ వినియోగించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత అని పేర్కొన్నారు.

కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లో రెండు ఆధునిక టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు గేట్స్ ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని మంత్రులు అభినందించారు. ప్రజారోగ్యం, పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రీఫ్లో సంస్థ అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణకు చెందిన టీ-వర్క్స్ ద్వారా ఇక్కడే ప్రోటో టైపింగ్ చేస్తామ‌న్నారు. అంతే కాకుండా భవిష్యత్తులో ఈ టెక్నాలజీని ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా అందించే విధంగా హైదరాబాద్‌ను ఒక ఇన్నోవేషన్ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ఈ సాంకేతికతను మరింత విస్తరించేందుకు గేట్స్ ఫౌండేషన్ తమ సహకారాన్ని కొనసాగిస్తామని హామీ ఇవ్వడం సంతోషకరమని అన్నారు. రీఫ్లో సంస్థ కూడా పూర్తి స్థాయిలో సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కొత్త ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి హైదరాబాద్‌ను దేశంలోనే ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ప్రాజెక్టు మరో ముఖ్యమైన ముందడుగు అని మంత్రులు పేర్కొన్నారు . ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు, పరిశుభ్రమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో వినూత్న ప్రాజెక్టులను ప్రోత్సహిస్తామని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!