తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు : పీయూష్ గోయల్
గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి
ఢిల్లీ : తెలంగాణ నిర్దేశించుకున్న ‘తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యం సవాళ్లతో కూడుకున్నప్పటికీ.. సమిష్టి కృషితో దీనిని సాధించ వచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఫార్మా, అంతరిక్షం, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశోధన, ఆవిష్కరణ వంటి రంగాలలో రాష్ట్రంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించచారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టే ముందు ప్రాథమికంగా విధానాలలో స్థిరత్వం, నిబంధనలలో స్పష్టత, వ్యాపార కార్యకలాపాలలో పారదర్శకతను కోరుకుంటారని అన్నారు.
ఇందుకోసం ఆయన తెలంగాణ చరిత్రలోని కాకతీయ యుగాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. క్రీ.శ. 1244లో మోటుపల్లి ఓడరేవు వద్ద కాకతీయ పాలకుడు గణపతిదేవుడు జారీ చేసిన అభయ శాసనం, సముద్ర వాణిజ్యంలో కీలక సంస్కరణలకు పునాది వేసిందని ఆయన తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతించారు. తెలంగాణ నుంచి ఎగుమతులను పెంచేందుకు రాష్ట్రం ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. రాష్ట్రంలో అత్యధిక ఎగుమతి సామర్థ్యం ఉన్న 50 ఉత్పత్తులు, సేవలను గుర్తించాలని ఆయన సలహా ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణకు చెందిన జీఐ-ట్యాగ్ ఉత్పత్తులకు మరింత గుర్తింపు తీసుకు రావాలని ఆయన సిఫార్సు చేశారు. ఇందుకోసం, నాణ్యమైన ప్యాకేజింగ్, బ్రాండింగ్, మరియు ఉత్పత్తి మూలాలను గుర్తించేందుకు ట్రేసబిలిటీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు.
తాండూరు కందిపప్పు, చపాతీ మిరపకాయ, నిజామాబాద్ పసుపు వంటి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయంగా రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా చర్యలు తీసుకుంటే, వారి ఆదాయాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు తాండూర్ కందిపప్పు ఉత్పత్తులు ఎగుమతి అవ్వడమే, తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు ఉన్న అవకాశాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ఫార్మా రంగం మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని గోయల్ సూచించారు. కేవలం జెనరిక్ ఔషధాల తయారీపైనే కాకుండా, అధిక విలువ కలిగిన బ్రాండెడ్ ఔషధాలు, వినూత్న మందులు, బయోసిమిలర్లపై కూడా దృష్టి సారించాలని సలహా ఇచ్చారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అంతరిక్షం, విమానయానం, విమాన విడిభాగాల తయారీ, మెయింటెనెన్స్-రిపేర్-ఓవర్హాల్ సర్వీసెస్ (MRO), రక్షణ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ వంటి రంగాలలో తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సహించాలని ఆయన అన్నారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా, వరంగల్లో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంతో మాత్రమే వివిధ పరిశ్రమలలో ప్రపంచ స్థాయి నాయకత్వాన్ని సాధించగలమని ఆయన అన్నారు. దీపావళి పండుగలో ఒక్కో దీపం వెలిగించడం ద్వారా వెలుగు ఎలా వ్యాపిస్తుందో, అలాగే ప్రతి పెట్టుబడి, ప్రతి ఎగుమతి, ప్రతి కొత్త ఉద్యోగం, ప్రతి స్టార్టప్ దేశాభివృద్ధికి దోహద పడతాయని ఆయన అన్నారు.
భారతదేశం, తెలంగాణ భవిష్యత్తు సమిష్టి కృషిపై ఆధారపడి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో అవకాశాలను అన్వేషించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను నెలకొల్పాలని ఆయన దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ఈ పెట్టుబడుల ద్వారా ఉద్యోగ కల్పన, ప్రజల సంపద వృద్ధి, సమగ్ర అభివృద్ధిని సాధించవచ్చని ఆయన అన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
