అందుబాటులోకి ‘హైడ్రా’ అధికారిక పోర్టల్

ఒకే వేదికపై పౌర సేవల సమాచారం

హైద‌రాబాద్ : హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) అందిస్తున్న సేవ‌ల వివ‌రాల‌తో పాటు కార్య‌క‌లాపాల‌ను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు హైడ్రా క‌ల్పించింది. https://hydraa.telangana.gov.in పేరిట రూపొందించిన పోర్ట‌ల్‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప్రారంభించారు. హైడ్రాకు సంబంధించిన వివిధ సేవలు, సమాచారం, అత్యవసర సహాయం, వాతావరణ వివరాలు, భూములు, చెరువులు, అధికార పరిధి తదితర అంశాలను తెలుసుకోవచ్చు. చెరువుల హ‌ద్దులు, కాలువ‌ల లెక్క‌లు, ప్ర‌భుత్వ భూముల వివ‌రాలు, విపత్తు నిర్వహణ సమాచారంతో పాటు హైడ్రా కార్య‌క‌లాపాల‌న్నీ ఈ వెబ్‌సైట్ ద్వారా పొందుప‌ర్చారు. హైడ్రా 24 గంటల అత్యవసర హెల్ప్‌లైన్‌ 1070 వివరాలను పోర్టల్‌లో ప్రముఖంగా పొందుప రిచారు. చెట్లు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, రహదారులపై నీరు నిలవడం, వరదలు, సహాయక చర్యలు, ఇతర విపత్తు సంబంధిత అత్యవసర పరిస్థితులపై పౌరులు ఈ నంబరుకు సమాచారం ఇవ్వవచ్చు.

హైడ్రా పోర్టల్‌ ద్వారానే ఫైర్‌ సేఫ్టీ ఎన్‌వోసీల‌కు దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. భవన యజమానులు, నిర్మాణదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు తమ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. సంబంధిత అధికారులు శాఖ డ్యాష్‌బోర్డు ద్వారా దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకునే వీలుంది . భారీ వర్షాలు, వరదల సమయంలో నీరు నిలిచే అవకాశం ఉన్న కీలక ప్రాంతాల వివరాలను అందుబాటులో ఉంచారు. జీహెచ్ ఎంసీ , సీఎంసీ, ఎంఎంసీ కమిషనరేట్ల పరిధిలోని వాటర్ లాగింగ్‌, వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్‌లను వేర్వేరుగా చూడవచ్చు. దీంతో భారీ వర్షాల సమయంలో అధికారులు పర్యవేక్షించే ముఖ్య ప్రాంతాలను పౌరులు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది.

పోర్టల్‌ ద్వారా లైవ్‌ రైన్‌ఫాల్‌ మ్యాప్స్‌, రోజువారీ వర్షపాతం వివరాలు, వాతావరణ అంచనాలు, హైదరాబాద్‌ డాప్లర్‌ రాడార్‌ సమాచారం అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, భారీ వర్షాల సమయంలో ప్రజలు తాజా వాతావరణ పరిస్థితులను తెలుసు కునేందుకు ఇవి ఉపయోగ పడతాయి.
హైడ్రా వెబ్‌సైట్‌ నుంచి HMDA Lakes Portal‌ను నేరుగా సందర్శించి చెరువులకు సంబంధించిన ఎఫ్ టీ ఎల్ వివరాలను తెలుసుకోవచ్చు. చెరువులు, ఇతర జలాశయాల చుట్టూ అమల్లో ఉండే ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిబంధనలపై కూడా పోర్టల్‌లో సమాచారం అందుబాటులో ఉంటుంది. చెరువుల సమీపంలో భవన నిర్మాణం లేదా ఇతర అభివృద్ధి పనులు చేపట్టే ముందు వర్తించే నిబంధనలను తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

Leave A Reply

Your Email Id will not be published!