పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదు

శాస‌న స‌భ‌లో ప్ర‌క‌టించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, పాలిటెక్నిక్ విద్యలో తీసుకొచ్చిన మార్పులు, వాటిపై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు వంటి కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పాలిలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. విద్యార్థులు ఎవరి చేతుల్లోనో పావులుగా, కీలుబొమ్మలుగా మారొద్దని కోరారు. ముందు యుగం దూతలుగా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని, నిజాయితీగా వివరాలందించిన కాలేజీల రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడతల వారిగా చెల్లిస్తామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం విద్యా రంగానికి ఎందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందో సభలో వివరించారు. ముఖ్యంగా పాలిటెక్నిక్ కళాశాలలను విద్యాశాఖ పరిధి నుంచి స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకు రావడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బ తీయడానికి కాదని, వారిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకేనని స్ప‌ష్టం చేశారు.

ఈ విషయంలో ఇప్పటికీ అనుమానాలుంటే సభ్యులు, నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, చర్యలు చేపట్టి సరిదిద్దు కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు . “విద్య ఒక్కటే మన జీవితాల్లో వెలుగును తీసుకొస్తుంది” అనే సంపూర్ణ విశ్వాసంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులు కాకుండా విద్య లేక పోవడమే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలించేందుకు కే కేశవరావు నేతృత్వంలో కమిటీని నియమించాం. సభ్యులు, విద్యా రంగ నిపుణులు ఎవరైనా తమ సూచనలు, సలహాలను కమిటీకి అందిస్తే వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. తాను విద్యాశాఖపై ఒక తపనతో పని చేస్తున్నాన‌ని చెప్పారు. .

2023-24లో గత ప్రభుత్వం విద్యా శాఖకు రూ.19,093 కోట్లు కేటాయించగా తమ ప్రభుత్వం 2024-25లో రూ.21,292 కోట్లు కేటాయించాం అన్నారు. 2025-26లో రూ.23,108 కోట్లకు, 2026-27లో రూ.26,647 కోట్లకు పెంచామ‌ని తెలిపారు సీఎం. కేవలం మూడేళ్లలోనే విద్యాశాఖ బడ్జెట్‌ను రూ.7,554 కోట్ల మేర పెంచాం అని వెల్ల‌డించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కేవలం 55 రోజుల్లో 10,006 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7,857 మంది ఉపాధ్యాయులను మాత్రమే నియమించింద అని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!