త‌క్ష‌ణ‌మే క‌రువు సాయం అందించాలి : సీఎం

కేంద్ర స‌ర్కార్ కు విన్న‌వించిన డీకే శివ‌కుమార్

బెంగ‌ళూరు : కరువు సహాయక నిధులలో 50 శాతాన్ని మధ్యంతర సాయంగా వెంట‌నే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు ముఖ్య‌మంత్రి డి.కె. శివకుమార్. కర్ణాటకలో కరువు పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్రం సమర్పించిన కరువు సహాయక విజ్ఞప్తిలోని మొత్తంలో 50 శాతాన్ని మధ్యంతర ఆర్థిక సాయంగా విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిన 101 తాలూకాలలో తక్షణ కరువు సహాయక చర్యల కోసం రూ. 3,705.30 కోట్ల సాయం కోరుతూ సెప్టెంబర్ 10న తాను రాసిన లేఖను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కరువు పరిస్థితి మరింత తీవ్రమైందని, ‘కరువు నిర్వహణ మాన్యువల్-2020’లో నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా శాస్త్రీయంగా అంచనా వేసిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 76 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిందని సీఎం ప్ర‌క‌టించారు.

దీంతో మొత్తం కరువు ప్రభావిత తాలూకాల సంఖ్య 177కి చేరిందని తెలిపారు డీకే శివకుమార్. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసే సమయానికి ఈ సంఖ్య 200 దాటవచ్చని చెప్పారు. కొత్తగా కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన తాలూకాలలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ‘జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి’ కింద సాయం కోరుతూ అదనపు విజ్ఞప్తిని సమర్పిస్తామని శివకుమార్ వెల్ల‌డించారు. కర్ణాటకలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రధాన వర్షపాత కాలమని, జూన్-ఆగస్టు మధ్య కురిసే వర్షాలు ఖరీఫ్ వ్యవసాయానికే కాకుండా జలాశయాల నింపడానికి, జలవిద్యుత్ ఉత్పత్తికి, పశుగ్రాస లభ్యతకు , భూగర్భ జలాల పునరుద్ధరణకు కూడా అత్యంత కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో భారీ వర్షపాత లోటు కారణంగా ఈ రంగాలపై తీవ్ర ప్రభావం పడిందని వాపోయారు. ముఖ్యంగా కావేరీ బేసిన్‌లో జలాశయాల నీటి నిల్వలు తక్కువగా ఉండటంపై శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాబోయే నెలల్లో బెంగళూరు , దానిని ఆనుకుని ఉన్న జిల్లాల్లో తాగునీటి లభ్యతపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు చివరి దశకు చేరుకున్నప్పటికీ రాష్ట్రంలో వర్షపాతం లోటు గణనీయంగా కొనసాగుతుండటంతో, రాబోయే నెలల్లో కరువు పరిస్థితులు మరింత తీవ్రమై వేసవిలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!