న్యూఢిల్లీ : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా ఆయన హిందూ సంస్థల శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తన అనుభవాల గురించి పంచుకున్నారు. గుజరాత్ నుండి ఢిల్లీ వరకు, బీజేపీ పాలన విలువలలో ‘సేవ’ ఎల్లప్పుడూ మార్గదర్శక సూత్రంగా ఉండిందని, పార్టీ ఎప్పటికీ సేవా మార్గం నుండి పక్కకు తప్పుకోదని ప్రధాన మంత్రిగురువారం స్పష్టం చేశారు. గుజరాత్లోని వద్నగర్ నుండి ఉత్తరప్రదేశ్లోని వారణాసి వరకు సాగుతున్న ‘సేవా సంకల్ప యాత్ర’లో పాల్గొంటున్నవారితో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ 76వ పుట్టినరోజు , ప్రజా ప్రతినిధిగా ఆయన 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని, వివిధ రాష్ట్రాలకు చెందిన యువతతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో పాల్గొంటున్నవారు ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో ఉన్నారు.
గుజరాత్ నుండి ఢిల్లీ వరకు, సేవ మా పాలన , విలువలలో ప్రధానాంశంగా ఉంది. పాలనలో సేవ ప్రధానమైనప్పుడు, ప్రతి విధానం వెనుక ‘నాగరిక్ దేవో భవ’ (పౌరుడే దేవుడు) అనే సంకల్పం అంతర్లీనంగా ఉంటుంది అని ప్రధాని మోదీ అన్నారు. రాజకీయాల్లో ఎంతటి అధికారాన్ని పొందినప్పటికీ, మా ప్రాథమిక మార్గం సేవగానే ఉంటుందని తమమ ప్రవర్తన ద్వారా తెలియ జేయాలని అన్నారు పీఎం. తాము ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నా, ఆ మార్గం నుండి ఎప్పటికీ పక్కకు తప్పుకోమని పేర్కొన్నారు. సేవా భావంతో చేసిన పనులను ప్రజలు గుర్తుంచు కుంటారని, సేవ చేసేవారిని ఆశీర్వదిస్తారని మోదీ నొక్కి చెప్పారు. నా జీవితమంతా ప్రజల ఆశీర్వాదాలతోనే సాగింది. వారి ఆశీర్వాదాలే నాకు గొప్ప శక్తి వనరుగా నిలిచాయి అని ఆయన అన్నారు.
సేవను తమ ప్రధాన లక్ష్యంగా చేసుకోవాలని మోదీ వారిని కోరారు. మీరు కేవలం మాటల ద్వారా కాకుండా, మీ చేతల ద్వారా సేవా సందేశాన్ని వ్యాప్తి చేయాలి. తాము సేవా సందేశాన్ని మాటలతో కాకుండా, సేవ చేయడం ద్వారానే తెలియ చేస్తామన్నారు. ప్రజలకు సేవ చేయండి. మీ ప్రవర్తన ద్వారానే ఆ సేవా భావాన్ని చాటండి. సేవయే అత్యున్నత ధర్మం అనే స్ఫూర్తితోనే మనం ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.