అక్టోబరు 2న‌ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాప‌న‌

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : అక్టోబరు 2 తేదీన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన చేయనున్నామని, అదే రోజు రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని వెల్ల‌డించారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. మైక్రోసాఫ్ట్ సహకారంతో రూపొందించిన ఏఐ స్టాక్ ద్వారా కలిగే లాభాలను వివరిస్తూ డెమో ఇవ్వాలని సీఎం సూచించారు. భూగర్భ జలాలు సహా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలపైనా అమెరికాలోని పృథ్వీ అనే యువకుడు రూపోందించిన యాప్ లను సీఎం పరిశీలించారు. వివిధ శాఖల నుంచి సేకరించిన డేటా సెట్లను సమన్వయం చేసుకుంటూ నాసా ఉపగ్రహ చిత్రాలను అనుసంధానం చేస్తూ ఈ యాప్ ను రూపొందించిన పృథ్విని అభినందించారు. భూగర్భ జలాల స్థాయిలు, వాటి మార్పులు, ప్రాంతాల వారీ పరిస్థితులను విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో నీటి నిర్వహణకు మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగు పరచాలని సీఎం ఆదేశించారు. విద్యుత్‌ టారిఫ్‌ను పెంచక పోయినా సేవల్లో లోపాల కారణంగా ప్రజల్లో సంతృప్తి తగ్గుతోందని, సరఫరా నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో 287.214 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉన్న నేపథ్యంలో.. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన నీటి లభ్యతపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత ధరలు, సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. శాప్‌ ఆధ్వర్యంలో ఏడాది క్రీడా క్యాలెండర్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామ స్థాయిలోనూ క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. 175 నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో సిబ్బంది పనితీరును మెరుగు పరిచేలా స్పష్టమైన సూచనలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నోడల్‌ అధికారుల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి పనితీరులో మార్పు తీసుకు రావాలని ఆదేశించారు. గృహ నిర్మాణంలో జీరామ్‌జీ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టాలని అన్నారు. డేటా ఆధారిత పాలనలో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌ యాప్‌ల వినియోగం, సమాచార విశ్లేషణను మరింత విస్తరించాలని సీఎం స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!