అమరావతి : ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ సంక్షేమ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని, బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా హాస్టళ్లు, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణకు మంత్రి సవిత కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ సంక్షేమ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ, విద్యార్థుల యోగా క్షేమాలను గమనిస్తూ ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
వేడి, తాజా ఆహారం మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. బయట ఆహారాన్ని లోపలికి రానివ్వొద్దని, కాచి చల్లార్చిన నీటి మాత్రమే అందివ్వాలని ఆదేశించారు ఎస్. సవిత. హాస్టళ్లు, గురుకులాల చుట్టు పక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, వ్యాధులు ప్రబలక ముందే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని అన్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురి కాగానే సమీప ఆసుపత్రులకు తరలించాలన్నారు. పాత భవనాల్లో ఉన్న విద్యార్థులను సురక్షిత భవనాల్లోకి తరలించాలని మంత్రి సవిత ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని అన్నారు. కూటమిలోని పార్టీలు, నాయకులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. రెండేళ్ల సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో బీసీల అభివృద్ధి కోసం అమలు చేసిన పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని ఆదేశించారు.