సమగ్ర అభివృద్ధి కూట‌మి ప్ర‌భుత్వ‌ లక్ష్యం

కీల‌క వ్యాఖ్యుల చేసిన ముఖ్య‌మంత్రి, మంత్రి

అమ‌రావ‌తి : అందరికీ పీపీపీ మోడల్ తెలుసు కానీ ఏపీలో పీ-4 మోడల్ అమలు చేస్తున్నాం అన్నారు మంత్రి లోకేష్. ప్రజలను నాలుగో భాగస్వామిగా చేర్చాం. అభివృద్ధి ప్రయాణంలో పేదలు, వెనుకబడిన వర్గాలను విస్మరించ కూడదు. మేం మరింత సమగ్ర అభివృద్ధి కోరుకుంటున్నాం. కేవలం నగదు ఇవ్వడం పరిష్కారం కాదని మేం విశ్వసిస్తున్నాం. ఆలోచనలు, అనుభవం, అవకాశాల పరిచయం కూడా అంతే ముఖ్యమైనవి. ఇక్కడ పరిశ్రమలు కీలక పాత్ర పోషించాలి. దారిద్ర రేఖ‌కు దిగువన ఉన్న ప్రజలకు కొత్త అవకాశాలను పరిచయం చేయాలి. ఏపీలోని నియోజకవర్గాల్లో దీనివల్ల అద్భుతమైన మార్పులను చూస్తున్నాం. ముఖ్యమంత్రి ఇటీవల తన నియోజకవర్గానికి వెళ్లి తిరిగి వస్తూ ఒక విషయం మాతో పంచుకున్నారు. ఏడాది క్రితం వరకు ఇటుకల బట్టీలో పనిచేసిన ఒక మహిళ ఇప్పుడు అదే వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆమె ప్రస్తుతం 20 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆమెకు పెట్టుబడిగా అవసరమైనది కేవలం రూ.60 వేలు మాత్రమే.

కానీ అంతకంటే ముఖ్యంగా ఆమెకు బుక్‌కీపింగ్ ఎలా చేయాలి? కొత్త మార్కెట్లను ఎలా అన్వేషించాలి? ఉత్పత్తిని ఎలా అమ్మాలి? మార్కెటింగ్ ఎలా చేయాలి? అనే విషయాల్లో మార్గదర్శకత్వం అవసరమైంది. అక్కడే నిజమైన విలువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయి. మనమందరం మన అనుభవాల ఫలితమే. బిజినెస్ స్కూల్‌లో నేర్చుకునే దానికంటే, జీవిత ప్రయాణంలో మనం చాలా ఎక్కువ నేర్చుకుంటాం అన్నారు నారా లోకేష్‌. ఆ అనుభవాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి. కంపెనీలు పాఠశాలలను దత్తత తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఇదే మేం అమలుచేస్తున్న పీ-4 మోడల్. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ కూడా ఉండాలి. రాష్ట్రాలు పోటీ పడితే, భారతదేశం గెలుస్తుంది. నేను దీనిని పూర్తిగా విశ్వసిస్తా. ఈ కార్యక్రమం తర్వాత నేను గుజరాత్‌కు వెళ్తున్నాను. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్‌కు కొన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాను. అదే విధంగా గుజరాత్ వాళ్లు కూడా ఆక్వా రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్‌కు రావచ్చు. ఇదే విధంగా మనం పనిచేయాలి. ఒక రాష్ట్రం ఏదైనా కొత్తగా చేసి మంచి ఫలితాలు సాధిస్తే, ఇతర రాష్ట్రాలు త్వరగా నేర్చుకుంటాయి.

Leave A Reply

Your Email Id will not be published!