ఆధ్యాత్మిక అనుభూతిగా మార్చేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్

త్వరలో భక్తులకు అందుబాటులోకి ఎస్వీ మ్యూజియం

తిరుమల : తిరుమలలో భక్తుల నిరీక్షణ సమయాన్ని మరింత ఆధ్యాత్మికంగా, జ్ఞానదాయకంగా మార్చేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్‌ (పిల్గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్)ను ఏర్పాటు చేసిందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ప్ర‌క‌టించారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్‌ను, నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను మీడియా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో అదనపు ఈవో మీడియా ప్రతినిధులతో సమావేశమై ఈ రెండు ప్రాజెక్టులపై వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ 16న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని చెప్పారు ఏఈవో. వాటిలో భాగంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో పిల్గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు స్వామివారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణాలు, ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక అంశాలు తదితరాలను 3డీ, వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందించేందుకు ఈ కేంద్రాన్ని వినియోగించనున్నట్లు చెప్పారు.

భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయం ఒక నిరీక్షణగా కాకుండా, ఆధ్యాత్మికతను పెంపొందించుకునే, జ్ఞానాన్ని పొందే సమయంగా మార్చాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఇప్పటికే దుర్లభ్ దర్శనం సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్ రియాలిటీకి సంబంధించిన కంటెంట్‌ను రూపొందించారని పేర్కొన్నారు. భారీ స్థాయిలో భక్తులను ఆకట్టుకునేలా ఈ సాంకేతికతను ఎలా వినియోగించాలన్న అంశంపై మరింతగా కృషి జరుగుతోందని అన్నారు ఏఈవో. భవిష్యత్తులో స్వామివారికి సంబంధించిన కథలు, భక్తుల అనుభవాలు, తిరుమల కొండపై ఉన్న వివిధ విశిష్టతలు, ఆలయ చరిత్ర, నిర్మాణం, పరిపాలన, సేవలు, పురాణాలు, దాతలు తదితర అంశాలపై నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించి ఎప్పటికప్పుడు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో నిరంతరం కొత్త కంటెంట్ అందుబాటులో ఉండేలా ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని అదనపు ఈవో తెలిపారు. పురాణాలు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవం, స్వామివారి సేవలు, భక్తుల కథలు, ఆలయ నిర్మాణం, చరిత్ర, పరిపాలన, దాతల సేవలు తదితర అంశాలపై విభిన్న కథనాలను రూపొందించి క్రమం తప్పకుండా ప్రసారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో భక్తులు దర్శనానికి వెళ్లే ముందు స్వామివారి గురించి, తిరుమల ఆలయం గురించి, ఇక్కడి సంప్రదాయాలు, సేవలు, చరిత్ర గురించి మరింత తెలుసుకుని ఆధ్యాత్మిక పరిపూర్ణత, సంతృప్తితో దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!