తిరువనంతపురం : తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్టాత్మకమైన ‘ఆర్యదన్ మహమ్మద్-2026’ అవార్డును అందుకున్నారు. కేరళలోని నిలంబూర్‌లో ‘ఆర్యదన్ మహమ్మద్ ఫౌండేషన్’ నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కె.సి. వేణుగోపాల్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆర్యదన్ మహమ్మద్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం గొప్ప గౌరవమని పేర్కొన్నారు. తనను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేరళ వెలుపలి నుండి ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన మొదటి వ్యక్తిగా నిలవడం మరింత గౌరవప్రదంగా భావిస్తున్నానని అన్నారు.
నేను కేరళకు వచ్చిన ప్రతిసారీ నాకు ఎంతో ఆప్యాయమైన స్వాగతం లభించింది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘భారత్ జోడో యాత్ర’ కోసం నేను ఇక్కడికి వచ్చాను. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇక్కడికి వచ్చాను. కేరళ అంటే నాకు ఎంతో ఇష్టం. లౌకికవాదం పట్ల కేరళ ప్రజలకు ఉన్న నిబద్ధతకు నేను కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను అని చెప్పారు. ఆర్యదన్ మహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడు. ఆయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. పలువురు ముఖ్యమంత్రుల హయాంలో నాలుగు సార్లు మంత్రిగా పనిచేశారు. కేరళ రాజకీయాల్లో ఆయన ఒక చాణక్యుడిలా ఉండేవారు అని ఆయన పేర్కొన్నారు.
నిలంబూర్లోనూ, కేరళలోనూ కాంగ్రెస్ పార్టీకి ఆర్యదన్ మహమ్మద్ ఒక మహా వృక్షంలా (మర్రిచెట్టులా) ఉండేవారని సీఎం గుర్తు చేసుకున్నారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం , రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన తన జీవితకాలం పోరాడారని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆర్యదన్ స్ఫూర్తితో మనమందరం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యదన్ మహమ్మద్ ఫౌండేషన్ చైర్మన్ ఆర్యదన్ షౌకత్, కేరళ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.