కొన‌సాగుతున్న వ‌ర్షాలు పొంగిపొర్లుతున్న వాగులు, వంక‌లు

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చ‌రిక‌లు జారీ

అమ‌రావ‌తి : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గోదావరి నది ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.11 లక్షల క్యూసెక్కులు ఉందని రేపు రాత్రికి వరద ఉధృతి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వెల్ల‌డించారు. ఆదివారం రాత్రి నుంచి వరద క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. కృష్ణా నదికి స్వల్పంగా వరద ప్రవాహం రావడంతో ప్రకాశం బ్యారేజి వద్ద నీటిని విడుదల చేస్తున్నందున దిగువ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎండీ. వరద ముప్పు ఉన్న ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉన్నాయన్నారు. వరద పూర్తి స్థాయిలో తగ్గే వరకు నది పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని స్పష్టం చేశారు. నదుల్లో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, నదిలో ప్రయాణం లాంటివి చేయరాదన్నారు.

నాగావళి నదికి వరద ప్రవాహం సాయంత్రం 6 గంటలకు తోటపల్లి రిజర్వాయర్ వద్ద ఇన్ ఫ్లో, , ఔట్ ఫ్లో 23250 క్యూసెక్కులుగా ఉందన్నారు ప్ర‌ఖ‌ర్ జైన్. నారాయణపురం ఆనకట్ట వద్ద మొదటి హెచ్చరిక కొనసాగుతూ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 63,900 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. మరోవైపు వంశధార నది గొట్టా బ్యారేజ్ వద్ద ప్రస్తుతం మొదటి ప్రమాద అమలులో ఉందని తెలిపారు. బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో 47,400 క్యూసెక్కులు కాగా, దిగువకు 49,136 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని వెల్లడించారు. రేపటి నుంచి వంశధార, నాగావళి నదుల వరద తగ్గుతుందని పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురు మదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!