స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలి
పిలుపునిచ్చిన పార్టీ చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి : రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ శ్రేణులు సత్తా చాటాలని జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీతో భేటీ అయ్యారు. జనసేన పార్టీ శ్రేణుల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించాలన్నారు. దానిని ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులకు నివేదించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ప్రత్యేక సమన్వయ కమిటీ ఫోకస్ పెట్టాలన్నారు డిప్యూటీ సీఎం.
ఈ సందర్భంగా కమిటీ విధి విధానాలు, బాధ్యతలు, పనితీరుతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అందించే సహకారంపై పవన్ కళ్యాణ్ కమిటీ సభ్యులకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి కమిటీల ద్వారా సేకరించిన సమగ్ర సమాచారాన్ని నివేదికల రూపంలో సిద్ధం చేయాలని ఆదేశించారు. సమన్వయంతో ముందుకు సాగాలని, ఎప్పటికప్పుడు సమాచారం తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. కమిటీ తదుపరి కార్యాచరణపై సోమవారం మరోసారి సమావేశమై, పూర్తిస్థాయిలో కార్యాచరణకు సన్నద్ధం కావాలని పవన్ కళ్యాణ్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సభ్యులు, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్, భీమవరం నియోజకవర్గానికి చెందిన పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.