కేంద్రం నిర్వాకం ఆయిల్ పామ్ రైతుల‌కు శాపం

నిప్పులు చెరిగిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర సర్కార్ నిర్వాకంపై. తాజా నిర్ణ‌యంతో రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతుల‌కు శాపంగా మారింద‌న్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూనే ఇంకో వైపు వారి ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధానాలు ఎందుకు తీసుకు వ‌స్తున్నారంటూ ప్ర‌శ్నించారు. దిగుమతి సుంకం తగ్గింపుతో దేశీయ ఆయిల్ పామ్ రైతులకు ధరలపై ఒత్తిడి పడే అవకాశం ఉంద‌న్నారు. రాష్ట్రం 44 శాతం దిగుమతి సుంకం కోరుతుంటే కేంద్రం 16.5 శాతం నుంచి 11 శాతానికి తగ్గించడం దారుణ‌మ‌న్నారు మంత్రి. కేంద్ర నిర్ణయం ఆయిల్ పామ్ రైతుల్లో అనిశ్చితిని పెంచే అవకాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే పునరాలోచించాలని కోరారు.

రైతులను ఆయిల్ పామ్ వైపు మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంద‌ని చెప్పారు మంత్రి. ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్ర దిగుమతి సుంకం తగ్గింపు ప్రతికూలంగా మారే అవకాశం ఉంద‌న్నారు. ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు దేశంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని, రైతులను ఈ పంట వైపు మళ్లించాలని రాష్ట్రాలకు సూచిస్తూ.. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై సుంకాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు.

రైతును ఆయిల్ పామ్ సాగు చేయమని ప్రోత్సహిస్తారు.. కానీ రైతు పండించిన గెలలకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితులను మాత్రం కేంద్రం దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఒక చేత్తో రైతును ఆయిల్ పామ్ వైపు నడిపిస్తూ.. మరో చేత్తో దిగుమతి సుంకం తగ్గించి విదేశీ పామాయిల్‌కు మార్కెట్‌ను సులభతరం చేయడం ఏ విధమైన రైతు అనుకూల విధానం? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో క్రూడ్ పామ్ ఆయిల్‌పై మొత్తం దిగుమతి సుంకం 16.5 శాతం నుంచి 11 శాతానికి తగ్గిందన్నారు. దీంతో దిగుమతి చేసుకునే పామాయిల్‌కు పోటీ ప్రయోజనం పెరిగి, దేశీయంగా ఆయిల్ పామ్ గెలల ధరలపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!