హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్ లో అమెరికా డాలర్ ప్రభావం ఇతర దేశాల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజు రోజుకు దీని ఎఫెక్టు కారణంగా భారతీయ రూపాయిపై పడుతోంది. తాజాగా ఇవాళ జరిగిన అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 20 పైసలు తగ్గి 95.95కు చేరింది. బలపడుతున్న డాలర్, విదేశీ నిధుల తరలింపు, పెరుగుతున్న ముడి చమురు ధరలు రూపాయిపై ఒత్తిడిని పెంచాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య డాలర్ మరింత బలపడటం , విదేశీ నిధుల తరలింపు కొనసాగడంతో సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 20 పైసలు తగ్గి 95.95కు పడిపోయింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం కూడా స్థానిక కరెన్సీపై అదనపు ఒత్తిడిని తెచ్చిందని ఫారెక్స్ వ్యాపారులు పేర్కొన్నారు. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో అమెరికన్ కరెన్సీతో పోలిస్తే రూపాయి 95.89 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత మరింత బలహీనపడి 95.95 స్థాయిని తాకింది.
తద్వారా ఇది తన మునుపటి ముగింపు స్థాయి నుండి 20 పైసల నష్టాన్ని నమోదు చేసింది. శుక్రవారం నాడు రూపాయి విలువ 24 పైసలు పెరిగి అమెరికా డాలర్‌తో పోలిస్తే 95.75 వద్ద ముగిసింది. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీల సమూహంతో పోలిస్తే డాలర్ బలాన్ని సూచించే ‘డాలర్ ఇండెక్స్’ 0.15 శాతం పెరిగి 101.11 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ చమురు ధరలకు ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్, బ్యారెల్‌కు 106.81 డాలర్ల వద్ద 2.31 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇరాన్ నుండి వచ్చిన శాంతి ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడం వల్ల నవంబర్ సిరీస్ బ్రెంట్ చమురు ధరలు పెరిగినప్పటికీ, రూపాయి 95.80 వద్ద ప్రారంభమై 95.50 నుండి 96.00 శ్రేణిలో కొనసాగే అవకాశం ఉంది; అలాగే ఆర్బీఐ 96.00 స్థాయిని కాపాడుతూ వస్తోంది అని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ట్రెజరీ విభాగం అధిపతి , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ పేర్కొన్నారు.