అమరావతి : తమ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సోమవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో 372 మంది కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. కుంచనపల్లిలో జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు మంత్రి. నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు శాశ్వత గృహ స్థల పట్టాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్‌లో ‘మన ఇల్లు – మన లోకేష్’ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లలో దశాబ్దాలుగా నివసిస్తున్నప్పటికీ, చట్టపరమైన యాజమాన్య పత్రాలు లేని పేద కుటుంబాలకు యాజమాన్య హక్కులు కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని లోకేష్ తెలిపారు.
నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో దీర్ఘకాలంగా నివసిస్తున్న అర్హులైన లబ్ధిదారులందరికీ 2029 నాటికి పట్టాలు జారీ చేస్తానని గత ఎన్నికల సమయంలో ఆయన హామీ ఇచ్చారు. అధికారుల సమాచారం ప్రకారం, పట్టాలకు సంబంధించిన సమస్యలలో దాదాపు 80 శాతం ఇప్పటికే పరిష్కారమయ్యాయి; అయితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భూములకు సంబంధించిన కొన్ని కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం లోకేష్ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. మొదటి దశలో భాగంగా గత ఏడాది ఏప్రిల్‌లో 3,002 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేయగా, ఈ ఏడాది జూలైలో మరో 2,634 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఈ రెండు దశల్లోనూ లబ్ధిదారులకు ఉచితంగా శాశ్వత పట్టాలు జారీ చేశారు. దీని పరిధిలోకి వచ్చిన భూమి విలువ దాదాపు ₹2,000 కోట్లు ఉంటుందని అంచనా.
