దశాబ్దాల నాటి యూఎల్‌సి ఫైళ్లకు లైన్ క్లియ‌ర్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి పొంగులేటి

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో దశాబ్దాల నాటి యూఎల్‌సి ఫైళ్లను క్లియర్ చేయనున్నట్లు వెల్ల‌డించింది. నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని విధాన పరమైన లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత, అర్హులైన కేసులకు తక్షణమే క్రమబద్ధీకరణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పట్టణ భూ గరిష్ఠ పరిమితి (యూఎల్‌సి) దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని విధాన పరమైన లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత, అర్హులైన కేసులకు తక్షణమే క్రమబద్ధీకరణ చర్యలు ప్రారంభించడం జ‌రుగుతుంద‌న్నారు.

పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సి దరఖాస్తులను పరిష్కరించడానికి గత ప్రభుత్వం 2016లో ఒక ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) జారీ చేసినప్పటికీ, అది ఎన్నడూ అమలు కాలేదని అన్నారు. దీంతో వేలాది కేసులు సంవత్సరాల తరబడి పరిష్కారం కాకుండా మిగిలి పోయాయని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దీనివల్ల భూ హక్కులు, లావాదేవీల విషయంలో ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగాయని ఆయన అన్నారు. తెలంగాణ పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం కింద పాక్షికంగా క్రమబద్ధీకరించ బడిన లేదా క్రమబద్ధీకరించ బడని కాలనీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిశీలించి, అర్హులైన కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేసిన‌ట్లు చెప్పారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి.

ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోలు 455, 456, 747 – 92 కింద దాఖలైన పెండింగ్ యూఎల్‌సీ దరఖాస్తుల సమీక్ష , పరిష్కారాన్ని సులభతరం చేయడానికి మెమో నెం. 48062/ULC/A1/2026-1 జారీ చేసిన‌ట్లు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాలన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా, తోటి క్యాబినెట్ మంత్రులతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రభుత్వం ‘22A’ సమస్యలను ఫాస్ట్-ట్రాక్ ప్రక్రియ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించిందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!