అమరావతి : సర్దార్ షహీద్ భగత్ సింగ్ ను స్మరించుకున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల. యువతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. యువత అంటే కేవలం కలలు కనడం మాత్రమే కాదని, తమ నమ్మకాలకు కట్టుబడి ఉండే ధైర్యం , గొప్ప లక్ష్యం కోసం తమను తాము అంకితం చేసుకునే సంసిద్ధత కూడా యువతకు నిర్వచనం అని భగత్ సింగ్ జీవితం గుర్తు చేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. సోమవారం నాడు షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఎక్స్ వేదికగా పంచుకున్న సందేశంలో పవన్ కల్యాణ్ ఇలా అన్నారు: “దృఢ విశ్వాసంతో కూడిన ధైర్యం , గొప్ప లక్ష్యంతో కూడిన త్యాగం ఉన్నప్పుడు, ఒక దేశ యువత ఆ దేశానికి అత్యంత బలమైన శక్తిగా మారుతారు.”
భారత స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ పాత్రను గుర్తు చేసుకుంటూ అత్యంత నిర్భయులైన యువ విప్లవకారులలో ఆయన ఒకరని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. చాలా మంది యువకులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే వయసులోనే, భగత్ సింగ్ ధైర్యం, దృఢ విశ్వాసం , త్యాగాల మార్గాన్ని ఎంచుకున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ధైర్యంగా ఆలోచించాలని, నిర్భయంగా ప్రశ్నించాలని, దృఢ విశ్వాసంతో జీవించాలని, బలమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించడానికి తమ జ్ఞానం, శక్తి , ప్రతిభను అంకితం చేయాలని భగత్ సింగ్ వారసత్వం నేటి తరానికి పిలుపు నిస్తోందని ఆయన పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల.
ఇదిలా ఉండగా భగత్ సింగ్ తన జీవిత కాలంలో పేర్కొన్న మాటలు ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నాయి ఇప్పటికీ. వాటిలో కొన్ని. విప్లవం అనేది కేవలం బాంబులు, తుపాకులు కాదు. ఆలోచనల్లో మార్పు రావడం. నేను ఒక మనిషిని. మానవాళికి సంబంధించిన ప్రతి విషయం నాకు ఆసక్తికరమే.
జీవితం తనంతట తానుగా కాదు. ఒక గొప్ప లక్ష్యం కోసం జీవించినప్పుడే దానికి అర్థం ఉంటుంది. విప్లవం ఖడ్గం ఆలోచనల పదునుతో పదునెక్కుతుంది. నిర్దాక్షిణ్యమైన విమర్శ, స్వతంత్ర ఆలోచన విప్లవకారుడికి అవసరమైన రెండు లక్షణాలు. ప్రజల చేత ప్రజల కోసం చేసే విప్లవమే నిజమైన మార్పునకు మార్గం.
బానిసత్వంలో జీవించడం కంటే స్వేచ్ఛ కోసం పోరాడటం గొప్పది. మనిషి జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి; ఆ లక్ష్యం సమాజానికి ఉపయోగ పడేదిగా ఉండాలి. భయాన్ని జయించిన మనిషిని ఏ శక్తీ ఎక్కువ కాలం బానిసగా ఉంచలేరు.
