అమెరికా బ‌లోపేతంలో రాయ‌బారుల పాత్ర కీల‌కం

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన యుఎస్ విదేశాంగ మంత్రి

న్యూఢిల్లీ : అమెరికా దేశ విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశ రాజ‌ధాని న్యూడిల్లీలో యుఎస్ రాయ‌బారుల స‌మావేశం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క అంశాల గురించి ప్ర‌స్తావించారు. మన రాయబారులు అమెరికాను మరింత సురక్షితంగా, బలంగా , సంపన్నంగా తీర్చిదిద్దడంలో గర్విస్తున్నారని పేర్కొన్నారు. దక్షిణాసియా , మధ్య ఆసియాకు చెందిన అమెరికన్ రాయబారుల సమావేశం జ‌ర‌గడం విశేషం. ఈ రాయబారుల ప్రాంతీయ సమావేశానికి భారతదేశంలో యూఎస్ రాయబారి సెర్గియో గోర్ న్యూఢిల్లీలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ రోజు ఉదయం, రాయబారి సెర్గియో గోర్ ఆతిథ్యం ఇచ్చిన భారతదేశంలోని మా రాయబారుల ప్రాంతీయ సమావేశానికి నేను కాల్ ద్వారా హాజరయ్యాను అని రూబియో సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు.

కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్ , శ్రీలంక దేశాల యూఎస్ రాయబారులు, మిషన్ చీఫ్‌లతో మాట్లాడటం చాలా బాగుందని మార్క్ రూబియో అన్నారు. మా రాయబారులు అమెరికాను మరింత సురక్షితంగా ఉండేందుకు ఎంత‌గానో శ్ర‌మిస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. యూఎస్-మధ్య ఆసియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి , ద్వైపాక్షిక దౌత్య, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి దోహ‌దం చేస్తుంద‌న్నారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి. 100కు పైగా అమెరికన్ కంపెనీల వ్యాపార ప్రతినిధి బృందంతో అక్టోబర్ మధ్యలో ఉజ్బెకిస్తాన్‌లో పర్యటించనున్నట్లు తెలిపారు. గత దశాబ్ద కాలంగా యూఎస్ ఉజ్బెకిస్తాన్‌తో తన సంబంధాలను మరింత బలపరుచు కుంటోందని చెప్పారు. , ఈ మాజీ సోవియట్ దేశం ఈ ప్రాంతంలో ఒక కీలక మిత్రదేశంగా అవతరించింది.

Leave A Reply

Your Email Id will not be published!