వైఎస్సార్ కడప జిల్లా : రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేయనున్న హార్టీ కల్చర్ హాబ్ తో దేశంలోనే రాయలసీమ ఉద్యానవన సాగులో నెంబర్ వన్ గా నిలవనున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ప్రకటించారు మహ్మాతా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన మదనపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు హార్చీకల్చర్ హబ్ కు శ్రీకారం చుడుతున్నారన్నారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో పులివెందుల వాసులను, రాష్ట్ర ప్రజలను జగన్ నమ్మించి మోసం చేస్తే… కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల మున్సిపాల్టీలో కూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమలో హార్టీకల్చర్ హబ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. తాము ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామన్నారు సవిత.
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టుల పనులు కొనసాగిస్తూనే.మరో వైపు పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారని చెప్పారు ఎస్. సవిత. దీనిలో భాగంగా రూ.లక్ష కోట్లతో రాయసీమలో హార్టీకల్చర్ హబ్ ను ఏర్పాటు చేయనున్నారన్నారు. ఈ హార్టీకల్చర్ హబ్ తో రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కూడా లబ్ధి పొందుతాయని వెల్లడించారు. హార్టీకల్చర్ హబ్ తో దేశంలోనే ఉద్యానవన సాగులో రాయలసీమ నెంబర్ వన్ గా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.లక్ష కోట్లలో రూ.30 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నిధులు, రూ.10 వేల కోట్లు కేంద్రం, మిగిలిన రూ.60 వేల కోట్లు ప్రైవేటు నిధులు వెచ్చిస్తున్నాయన్నారు. హార్టకల్చర్ హబ్ ఏర్పాటుతో రాయలసీమ రూపురేఖలు మారనున్నాయన్ని మంత్రి సవిత ఆనందం వ్యక్తం చేశారు.
