కాలుష్యాన్ని వెద‌జ‌ల్లే ప‌రిశ్ర‌మ‌ల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు

కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి రూల్స్ పాటించాలి

అమ‌రావ‌తి : ఆక్వా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తప్పక పాటించాలని లేక పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్‌. పర్యావరణ పరిరక్షణ విషయంలో పరిశ్రమలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్ప‌ష్టం చేశారు; సహజ జల వనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఆక్వా పరిశ్రమలకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి కాలుష్య పర్యవేక్షణ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధికి సమానంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . స్వచ్ఛమైన తాగునీటిని అందించడం , సహజ జల వనరులను పరిరక్షించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతలని, జల వనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదని మండిప‌డ్డారు.

మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆక్వా ప్రాసెసింగ్ , ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్ల పర్యావరణ నిబంధనల అమలుపై ‘సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాస‌ , ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో పరిశ్రమలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. పర్యావరణానికి , సమాజానికి హాని కలిగించే విధంగా ఏ పరిశ్రమ అయినా నిబంధనలను ఇష్టానుసారంగా ఉల్లంఘించడం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. కాలుష్యాన్ని మూలంలోనే నివారించడం అత్యంత కీలకమైన చర్య అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆక్వా వ్యర్థాలు సహజ జల వనరులను , భూగర్భ జలాలను కలుషితం చేయకుండా నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలను పాటించాలని ఆయన ఆదేశించారు.

Leave A Reply

Your Email Id will not be published!