అమరావతి : కాకినాడ జిల్లా ఉప్పాడలోని సుబ్బంపేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. వారి ఆచూకీ కనుగొనేందుకు భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని, మత్స్యకారులను సురక్షితంగా తిరిగి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని భరోసా ఇచ్చారు. సుబ్బంపేటకు చెందిన గరికాని సింహాద్రి (తండ్రి మాములు) బోటుతో పాటు మరో పడవ ఈ నెల 4న చేపల వేట కోసం ఒడిశాలోని పారాదీప్ వైపు బయలు దేరాయని మంత్రి వివరించారు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం ప్రకారం పారాదీప్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లోకి వెళ్లినట్లు తెలిపారు. రెండు బోట్లలో ఒకటి ఈ నెల 18న తిరిగి రాగా, మరొకటి రాక పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 19న కోస్ట్‌గార్డ్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేశారన్నారు.
విషయం తెలియగానే రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు ఈ నెల 19వ తేదీ రాత్రే కోస్ట్‌గార్డ్‌కు లేఖ రాసి తక్షణ గాలింపు చర్యలు చేపట్టాలని కోరినట్లు మంత్రి తెలిపారు. దీంతో కాకినాడ, పారాదీప్ కోస్ట్‌గార్డ్ విభాగాలు, చెన్నైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయంతో అన్వేషణ ప్రారంభించాయని వివరించారు. గల్లంతైన బోటులో సుమారు 1,500 లీటర్ల డీజిల్‌తో పాటు 30 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారని మంత్రి పేర్కొన్నారు. కాకినాడ కోస్ట్‌గార్డ్ నిర్వహించిన సమావేశంలో బోటు ప్రయాణించిన మార్గం, చివరిగా వెళ్లిన ప్రాంతానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని కుటుంబ సభ్యులను అధికారులు కోరినట్లు తెలిపారు. వారు సూచించిన సముద్ర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఇప్పటివరకు పడవ జాడ లభించలేదన్నారు. తుఫాను ప్రభావంతో బోటు దారి తప్పి ఇతర దేశాల సముద్ర జలాల వైపు కొట్టుకుపోయి ఉండే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు సైతం సమాచారం అందించినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా అన్వేషణ కొనసాగిస్తున్నామని తెలిపారు.
