కార్తీక దీపాల కాంతులతో మెరిసిన ఇంద్రకీలాద్రి

నేత్రపర్వంగా కార్తీక దీపోత్సవం, జ్వాలా తోరణం

ఇంద్రకీలాద్రి:- పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల సన్నిధిలో ప్రదోషకాలంలో “కార్తీక దీపోత్సవం” అంగరంగ వైభవంగా, నయనమనోహరంగా జరిగింది. కార్తీక దామోదరునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ దీపోత్సవ వేడుకలో లక్షలాది దీపాల దివ్య కాంతులతో ఇంద్రకీలాద్రి గిరిశిఖరం దేదీప్య మానంగా వెలిగి పోయింది. ​సాయంత్రం కనకదుర్గ అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం, ఆలయ ప్రధాన రాజగోపురం ప్రాంగణంలో వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ బి.రాధాకృష్ణ దంపతులు, ఈవో వి.కె. శీనానాయక్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు భక్తిపారవశ్యంతో పాల్గొని కోటి వత్తుల మహాదీపాన్ని ప్రజ్వలన చేసి, “హర హర మహాదేవ శంభో శంకర” అంటూ ఆ పరమేశ్వరుణ్ణి కీర్తించారు. ​ప్రధాన ఆలయ ప్రాంగణం, ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నటరాజ స్వామి ఆలయ ప్రాంగణాలు, మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం మొదలుకుని మహామండపం ముందు నుండి దిగువ కనకదుర్గ నగర్ వరకు ఏర్పాటు చేసిన దీపాలను మొదట ఆలయ అర్చకులు పూజలు చేసి వెలిగించారు.

అనంతరం తరలి వచ్చిన వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో మిగతా దీపాలను వెలిగించి, ఆదిదంపతులైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు భక్తి ప్రపత్తులతో ప్రణతులు సమర్పించారు. పున్నమి వెలుగుల్లో సంప్రదాయ ఆలయనృత్య కళా బృందం ప్రదర్శించిన నృత్యరీతులు భక్తులను ఆకట్టుకున్నాయి. ​ఈ సందర్భంగా చైర్మన్ రాధాకృష్ణ మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తులకు విశేష పుణ్యఫలాలను అందించే దీపోత్సవ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వైశిష్ట్యంతో, ఆలయ స్థానాచార్యులు ,వైదిక కమిటీ ఆధ్వర్యంలో అత్యంత సంప్రదాయబద్ధంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ, వైదిక శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ మహోత్సవానికి విచ్చేసిన భక్తుల భద్రత దృష్ట్యా దేవస్థానం పరిధిలోని నాలుగు ప్రధాన ప్రదేశాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలతో పాటు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేసి పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
​దీపోత్సవ వేడుక అనంతరం మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు, పూజలతో పాటు అత్యంత విశిష్టమైన “జ్వాలా తోరణం” కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Leave A Reply

Your Email Id will not be published!