తిరుమల : శ్రీవారి భక్తులకు ”శ్రీవారి యాత్ర సురక్ష” పథకం ద్వారా దేశంలోనే తొలిసారిగా తమ యాత్రకు భరోసా కల్పిస్తున్నట్లు టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ , ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలియజేశారు. గత రెండు నెలల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చేసి సహజంగా మరణించిన ఏడుగురు కుటుంబ సభ్యులకు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎల్ఐసి ఆఫ్ ఇండియా సీఈవో ,ఎండీ శ్రీ ఆర్.దొరైస్వామిలతో కలిసి రూ.2 లక్షలు బీమా పరిహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాధికారిక మండలి చైర్మన్ , ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 9వ తేది ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. దేశానికే ఆదర్శవంతంగా ఉండేలా శ్రీవారి యాత్ర సురక్ష పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షలు అందించడం జరుగుతుందన్నారు. గత రెండు నెలల కాలంలో 17 మంది తిరుమలలో మరణించారని, వారిలో 7 మంది కుటుంబ సభ్యులకు బీమా పరిహారాన్ని అందించామన్నారు. మిగిలిన వారికి త్వరలో అందిస్తామని తెలియజేశారు.
అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి దేశానికి ఆదర్శవంతంగా ఈ బీమా పథకాన్ని తీసుకు రావడం జరిగిందన్నారు. టీటీడీ కోసం శ్రీవారి యాత్ర సురక్ష బీమా పథకాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చేందుకు సహకరించిన ఎల్ఐసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో బీమా పరిహారాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు .ఎల్ఐసీ ఆఫ్ ఇండియా సీఈవో , ఎండీ ఆర్.దొరైస్వామి మాట్లాడుతూ శ్రీవారి యాత్ర సురక్ష పథకం ద్వారా తిరుమల యాత్ర సమయంలో దురదృష్టవశాత్తు మరణించిన భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందజేయడం జరుగిందన్నారు. మరణ ధృవీకరణ పత్రం, నామినీ బ్యాంకు వివరాలు అందిన వెంటనే పరిహారం చెల్లించేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాత్ర సమయంలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన టీటీడీని అభినందిస్తూ, అన్ని కుటుంబాలకు సకాలంలో సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దేశంలో భక్తులకు జీవిత బీమా కవరేజ్ అందించే విషయంలో టీటీడీ మార్గదర్శక సంస్థగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని చూసి తాము కూడా అమలు చేసేందుకు శబరిమలైలోని ట్రావెన్ కోర్ దేవస్థానం, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం అధికారులు తమతో సంప్రదింపులు చేసినట్లు తెలియజేశారు
