చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయల్ టాటా కామెంట్స్
సమావేశానికి సంబంధించిన వీడియో, వివరాలు ఇవ్వాల్సిందే
ముంబై : టాటా గ్రూప్ లో ఎన్. చంద్రశేఖరన్ పునర్ నియామకం మరోసారి చర్చకు దారితీసేలా చేసింది. తన పునర్నియామక సమావేశానికి సంబంధించిన వీడియో, సమావేశ వివరాల రికార్డును బయట పెట్టాలని నోయెల్ టాటా కోరారు. బోర్డును సమావేశ వివరాలు, వీడియో రికార్డింగ్‌ను అడిగారు . అలాగే నిర్ణయం తీసుకున్న తర్వాత పొందిన న్యాయపరమైన అభిప్రాయాలను, వాటిని ఏ ప్రాతిపదికన కోరారో ప్రశ్నించారు. టాటా సన్స్ బోర్డు సెప్టెంబర్ సమావేశంలో చంద్రశేఖరన్‌ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తిరిగి నియమించే ప్రక్రియపై టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బోర్డుకు లేఖ రాశారని సంబంధిత వర్గాల సమాచారం ఆధారంగా ఒక నివేదిక తెలిపింది. సెప్టెంబర్ 30 నాటి ఈమెయిల్లో చంద్రశేఖరన్ పునర్నియామకం అంశం సమావేశ ఎజెండాలో లేదని, దానికి బదులుగా ఎన్ఆర్సీ ద్వారా సమీక్ష అనే అంశం కింద దానిని ప్రస్తావించారని నోయెల్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17 నాటి బోర్డు సమావేశంలో ఎటువంటి తీర్మానం ఆమోదించ బడలేదని ఆయన ఇంతకు ముందే పేర్కొన్నారు. సంచలన ఆరోపణలు కూడా చేశారు. గ్రూప్‌లో మెజారిటీ వాటాదారుగా ఉన్న టాటా ట్రస్ట్స్ చంద్రశేఖరన్‌ను మూడవసారి నియమిస్తూ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని చట్ట విరుద్ధం, చట్ట పరంగా చెల్లనిది అని అభివర్ణించింది. టాటా సన్స్ బోర్డులో నామినీ డైరెక్టర్‌గా ఉన్న నోయెల్ ఆ ఉద్రిక్తతతో కూడిన సమావేశంలో పునర్నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేశారని ట్రస్ట్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తిరిగి నియమించే నిర్ణయానికి మద్దతుగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ , మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీకృష్ణ ఇచ్చిన న్యాయపరమైన అభిప్రాయాలను టాటా సన్స్ ఉదహరించింది.
ఆర్టికల్ 104(B) కింద నియమితులైన డైరెక్టర్ల మధ్య ఓట్లు సమానంగా విభజన చెందినప్పుడు, నిర్ణయాత్మక ఓటు ఆర్టికల్ 121 నిబంధనలను సంతృప్తి పరిచిందని, తద్వారా ఆ తీర్మానం చట్టబద్ధంగా ఆమోదించ బడిందని ఆ ఇద్దరు న్యాయమూర్తులు పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి. పునః నియామకానికి ఇద్దరు నామినీ డైరెక్టర్లు మద్దతు ఇవ్వాలని టాటా ట్రస్ట్స్ వాదించింది . తమ వాదనకు మద్దతుగా మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ అభిప్రాయాన్ని ఉదహరించింది.
