శ్రీ సిటీ బాయిలర్ పేలుడు బాధాక‌రం : సీఎం

స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చంద్ర‌బాబు ఆదేశం

అమ‌రావ‌తి : తిరుప‌తి జిల్లా లోని శ్రీ సిటీలో శ‌నివారం టిల్ హెల్త్ కేర్ ఫార్మాస్యూటిక‌ల్ యూనిట్ లో పేలుడు ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. వెంటనే అధికారుల నుంచి ఘటన వివరాలు, గాయపడిన వారి పరిస్థితి, ఫ్యాక్టరీలో జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. ఇవాళ ఉదయం జరిగిన బాయిలర్ పేలుడు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించగా, తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడు చికిత్స పొందుతున్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పారిశ్రామిక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ఎటువంటి జాప్యం లేకుండా అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. గాయపడిన కార్మికుడికి అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా చూడాలని జిల్లా యంత్రాంగం, పోలీసు, ఆరోగ్య శాఖలను సీఎం ఆదేశించారు. అవసరమైతే అత్యాధునిక చికిత్స అందించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు , ఆసుపత్రి అధికారులను కోరారు. అలాగే సహాయక , పునరావాస చర్యలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రమాద స్థలంలో ఇంకా ఎవరైనా కార్మికులు చిక్కుకు పోయారేమో పరిశీలించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బాయిలర్ పేలుడుకు గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యం లేదా పారిశ్రామిక భద్రతా నిబంధనల ఉల్లంఘన ఏమైనా ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి విషాదకరమైన ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఫ్యాక్టరీలు , పారిశ్రామిక యూనిట్లలో భద్రతా చర్యలను సమీక్షించాలని ఆయన నొక్కి చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!