తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదు

ప్రతి గ్రామానికి నీటి భద్రతే అమరజీవి జలధార లక్ష్యం

అమ‌రావ‌తి : తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదని, అభివృద్ధి విషయంలో ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ విధానమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రత కల్పించడమే ‘అమరజీవి జలధార’ లక్ష్యమని నొక్కి చెప్పారు. సోమవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి రూ.30,156 కోట్ల విలువైన తాగునీటి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. శ్రీరామ చంద్రుని పాద స్పర్శతో పునీతమైన నేల. మహాత్మా గాంధీ నడయాడిన నేల. తెలుగు సాహిత్య్యాన్ని తన అక్షరాలతో సుసంపన్నం చేసిన సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులకు జన్మనిచ్చిన నేల ప్రొద్దుటూరు అన్నారు.

బంగారం, వస్త్ర వ్యాపారంలో మినీ ముంబై గా దసరా ఉత్సవాల్లో రెండో మైసూరు గా ప్రొద్దుటూరుకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రూ.30,156 కోట్లతో 50,315 పనులను శ్రీకారం చుడుతున్నాం అన్నారు. 24,601 ఆవాసాల్లో ఇప్పటికే ఉన్న 61.60 లక్షల కుళాయి కనెక్షన్ల సామర్థ్యాన్ని పెంచి స్థిరీకరించడంతో పాటు, మరో 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లను అందిస్తున్నాం అని తెలిపారు డిప్యూటీ సీఎం. మొత్తంగా 3.27 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన తాగు నీరు అందేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘హర్ ఘర్ జల్’ జల్ జీవన్ మిషన్‌కు గత ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. 2019-24 మధ్య కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ.26 వేల కోట్లు అందించినప్పటికీ గత ఐదేళ్లలో రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, అక్కడక్కడ పైపులైన్లు, చిన్నచిన్న పనులు చేసి వదిలేశారని ఆరోపించ‌చారు. 2024తో పథకం గడువు ముగుస్తుందని, నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుందని, ప్రజల తాగునీటి కష్టాలు ఎప్పటికీ తీరవని తెలిసినా కూడా పట్టించు కోలేదన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!