వాషింగ్టన్ : భారత్ అమెరికాకు అత్యంత బలమైన మిత్రదేశాలలో ఒకటి అని పేర్కొంది వైట్ హౌస్ . 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పావు శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా 7న ప్రధాని మోదీ ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్బంగా వైట్ హౌస్ భారతదేశాన్ని అమెరికా అత్యంత బలమైన మిత్రదేశాలలో ఒకటిగా అభివర్ణించింది. అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. వాణిజ్యం , ఇతర విధానపరమైన అంశాలపై భారత్, అమెరికా మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వైట్ హౌస్ తన స్పందనలో ఆ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు ( మే 2014 వరకు), ప్రధాని మోదీ అక్టోబర్ 7, 2001 నుండి గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
అధికారంలోకి వచ్చిన వివిధ ప్రభుత్వాల హయాంలో రక్షణ, సాంకేతికత, వాణిజ్యం, వ్యూహాత్మక అంశాలలో భారత్, అమెరికా విస్తృత సహకారాన్ని పెంపొందించు కోవడంలో ఫోకస్ పెట్టాయి. ఈ రెండు దేశాల మధ్య అధికారిక పరస్పర రక్షణ ఒప్పందం ఏదీ లేదు. ప్రధానమంత్రి మోదీ హయాంలో అంతర్జాతీయ వేదికపై భారత్ స్థాయి మరింత పెరిగింది. ప్రభుత్వం విస్తృత దౌత్య సంబంధాలను కొనసాగించడం, అగ్రరాజ్యాలతో బలమైన బంధాలను ఏర్పరచు కోవడం , ‘గ్లోబల్ సౌత్’ (అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి)లో భారత్ కీలక పాత్ర పోషించడం వంటివి దీనికి నిదర్శనాలుగా నిలిచాయి. ప్రభుత్వ అధినేతగా వరుసగా 25 ఏళ్ల సుదీర్ఘ సేవా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు.
