ఒకే దశలో పురపాలక ఎన్నికలు : కమిషనర్ అనిల్ చంద్ర
రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పరిశీలన
అమరావతి : రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒక దశలోనే నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిలచంద్ర పునేఠా తెలిపారు. నోటిఫికేషన్ విడుదల చేసిన సమయం నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నోటిఫికేషన్ వెలువడిన 14 రోజుల్లోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని, కాగా అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామన్నారు. 15 రోజుల్లో పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు చేపడతామని , రెండు రోజుల్లో ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. 16 రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు చేపడతామని, రెండు రోజుల తర్వాత రిజల్ట్స్ వెల్లడిస్తామని తెలిపారు అనిల్ చంద్ర.
పంచాయతీలకు మాత్రం పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఒంటి గంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు.పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 16 రోజుల్లో పూర్తి చేయనున్నారు. పోలింగ్ పూర్తయిన రెండు రోజుల తరువాత వీటిలో ఓట్లు లెక్కించనున్నారు. నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ ఏది ముందు వెలువడితే.. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికలకు మొత్తం 1,05,432 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. తెలంగాణ నుంచి 17,650 బాక్సులు తెప్పించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కీలక వివరాలు వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు సీఈఓ. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్లు, మెటీరియల్ సిద్ధం చేశాం అని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించాలన్న సూచనలు పరిశీలించి నిర్ణయాన్ని వెల్లడిస్తాం’ అని వివరించారు..
