ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ

రేవంత్ రెడ్డి స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా కార్మికుల తీర్పు

హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సంస్థకు జ‌రిగిన తాజా ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌రిచిన యూనియ‌న్ కూట‌మికి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. సాధారణంగా ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు , కార్మిక సంఘాల ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయి. కానీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అనేక హామీలు గుప్పించినా, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ద‌గ్గ‌రుండి ప్రచారం చేసినా ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ మద్దతు ఉన్న కూటమిని పెద్దగా పట్టించు కోలేదు. నిన్న జరిగిన తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల్లో టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయు) , నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయు) కూటమి ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ మద్దతు ఉన్న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడ‌బ్ల్యూయు) , స్టాఫ్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ (ఎస్ డ‌బ్ల్యూయు) కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గానీ, దానికి అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం గానీ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు.అగ్రనేతలు ప్రచారం చేసినప్పటికీ గుర్తింపు పొందిన యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి తిరస్కారం ఎదురవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి ఇది ఒక సంకేతమని చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, చివరి నిమిషం ఎన్నికల నిర్వహణ , అభ్యర్థి పట్ల ఉన్న సానుభూతి కారణంగా కాంగ్రెస్ తృటిలో గట్టెక్కింది. మున్సిపల్ , గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గట్టి పోటీని ఎదుర్కొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీకి సవాలు విసిరింది. ఇటువంటి ప్రతికూల ఫలితాలను చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ ఉప ఎన్నిక నుండి వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా, హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్ల ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు టాక్.

Leave A Reply

Your Email Id will not be published!