అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల సంచలన ప్రకటన చేశారు. తూర్పు గోదావరి జిల్లా చాగల్లు గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆరా తీశారు. అటవీ శాఖ అధికారులు అలర్ట్ గా ఉండాలని ఎప్పటికప్పుడు సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు పవన్ కళ్యాన్. ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ సమీపంలోని పంట పొలాల మధ్య పులి ఉన్నట్టు గుర్తించిన నేపథ్యంలో గ్రామస్తులు అటవీశాఖ అధికారుల సూచనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పులి కదలికలు, దానిని సురక్షితంగా బంధించేందుకు చేపడుతున్న చర్యలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. పులి సంచారానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు నిరంతరం చేరవేయాలని స్పష్టం చేశారు. ప్రజలు పొలాల వైపు ఒంటరిగా వెళ్లడం, పులిని నేరుగా చూడాలనే అత్యుత్సాహం ప్రదర్శించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. అటవీశాఖ అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. పులి అటవీ ప్రాంతం వెలుపల సంచరిస్తున్నందున దానిని సురక్షితంగా బంధించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో హనుమాన్ బృందాలను మోహరించాలని అన్నారు డిప్యూటీ సీఎం. దాని కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ మొత్తం ఆపరేషన్ను అటవీశాఖ జోనల్ కన్జర్వేటర్ పర్యవేక్షణలో సమన్వయంతో నిర్వహించాలని స్పష్టం చేశారు.
