హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణ చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎస్ సంజయ్ జాజును ఆదేశించారు. ఇందుకు సంబంధించి యుద్ద ప్రాతిపదికన నివేదికలు తయారు చేయాలన్నారు. వెంటనే యాక్షన్ ప్లాన్ రూపొందించాలని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉండటంతో చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో సరైన యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించక పోతే భవిష్యత్‌లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు సీఎం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రాబోయే 8 నెలలు ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కీలకమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ 8 నెలలు ప్రతీ కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.
రాబోయే రోజుల్లో విద్యుత్ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని, అయితే మార్కెట్లో విద్యుత్ అందుబాటులో లేదన్నారు. అందుకే అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ ఆధారిత పనులను సాధ్యమైనంత మేరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు సీఎం.ఎల్‌నినో ప్రభావంపై గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సినిమా, మీడియా, కళాజాతాలతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు . రైతులు వేసిన పంటల పరిస్థితులను అంచనావేసి, పంట చేతికొచ్చే వరకు నీటి కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, చుక్క నీరు కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై మంత్రులతో త్వరలో ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో కరువు మండలాల ప్రకటనతో పాటు తగినంత ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసిందని, రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరిందని గుర్తు చేశారు.వీబీ రాంజీ పథకంలో భాగంగా 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్రాన్ని కోరాలని సూచించారు. అదనపు పని దినాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు చేసే అంశాన్ని మంత్రుల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దసరా తరువాత గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎప్పటికపుడు పరిస్థితులను సమీక్షించేందుకు వార్‌రూమ్‌ను ఏర్పాటు చేయాలని, టోల్-ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు సీఎంఓ ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
