ఆర్థిక నేరాలపై విచారణ వేగవంతం కావాలి : కొల్లు రవీంద్ర
జగన్ మోహన్ రెడ్డిని జనం నమ్మే స్థితిలో లేరన్న మంత్రి
గుంటూరు జిల్లా : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని జనం నమ్మే స్థితిలో లేరన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆర్థిక నేరాలు సమాజానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ వంటివని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక పరిస్థితులపై, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. డబ్బు ఉందనే కారణంతో అక్రమాలకు పాల్పడటం, కేసుల విచారణ జరగకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. డబ్బుంటే కేసులను మాఫీ చేసుకోవచ్చా? డబ్బుంటే కేసులను సుదీర్ఘకాలం సాగదీయవచ్చా? అని ప్రశ్నించారు కొల్లు రవీంద్ర. కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా విచారణను ఆలస్యం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత హాజరు విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం కోర్టులకు ఉందని మంత్రి తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావాలా వద్దా అనే అంశం చట్టపరమైన వ్యవహారమని, దాని నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ వేస్తే దానిపై నిర్ణయం తీసుకునేది హైకోర్టేనని అన్నారు.
దీనికి ప్రభుత్వానికి ఏమి సంబంధమని ప్రశ్నించారు కొల్లు రవీంద్ర. ప్రతి అంశానికి సంబంధాలు కల్పిస్తూ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఉన్నామని చెప్పి విచారణల నుంచి తప్పించుకోవచ్చా? ప్రజా ప్రతినిధులు తప్పులు చేస్తే కోర్టులకు హాజరు కావాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఉన్న సమయంలోనూ విచారణలకు హాజరు కాకుండా వ్యవహరించారని, ఇప్పుడు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ వాయిదాలను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని సైతం కేసుల్లో ఏ5గా చేర్చే పరిస్థితి తీసుకొచ్చారని కొల్లు రవీంద్ర విమర్శించారు. కొడుకుగా తండ్రికి గౌరవం పెంచాల్సిన వ్యక్తి, తనపై ఉన్న ఆర్థిక నేరాల ఆరోపణల నేపథ్యంలో తండ్రి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు ఎదురయ్యే పరిస్థితిని కల్పించారని అన్నారు.
ఈ పరిణామాలు చరిత్రలో నిలిచి పోతాయని వ్యాఖ్యానించారు. తండ్రి మరణించినప్పుడు ఆయన భౌతికకాయం పక్కనే కూర్చుని సంతకాలు సేకరించి జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాలకు పాల్పడ్డాడని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారంలో ఉన్న సమయంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి తండ్రి పేరును సైతం కేసుల్లోకి తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కన్నతండ్రికి విలువలు పెంచాల్సిన కొడుకు, ఆయన్నే కేసుల్లో ఇరికించే పరిస్థితికి కారణమయ్యారని అన్నారు. జగన్ రాజకీయ సంస్కృతి, నేర చరిత్రపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా రెచ్చగొట్టే కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాదాపు పదకొండు కేసులు ఉన్నాయని, విచారణలకు హాజరు కాకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. పదహారు నెలలపాటు జైలు జీవితం గడిపినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. ఇంకా నేరపూరిత ఆలోచనలతో యువతను తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్రంలో వారిని సర్వనాశనం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘రప్పా రప్పా’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని, విచారణను తాత్కాలికంగా ఆలస్యం చేయాలని ప్రయత్నించినా కోర్టులు ఈ అంశాలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
