డ‌యాల‌సిస్ సేవ‌ల‌కు రూ.197.88 కోట్లు ఖ‌ర్చు చేశాం

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడి

అమరావతి :మూత్ర పిండాల (కిడ్నీ) వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్‌ కార్యక్రమం (పీఎంఎన్‌డీపీ) కింద కొత్తగా మరో 22 కేంద్రాలు త్వ‌ర‌లో ఏర్పాటు కాబోతున్నాయ‌ని రాష్ట్ర‌ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ వెల్ల‌డించారు. రోగుల అవసరాలు, ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పిఎంఎన్‌డిపి కింద 61 కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపారు. వీటికి అద‌నంగా కొత్తగా రానున్న 22 కేంద్రాల( మొత్తం 83) ద్వారా ఉచిత డయాలసిస్‌ (రక్తశుద్ధి) సేవలు పేద‌ల‌కు మ‌రింత చేరువ అవుతాయ‌ని వెల్ల‌డించారు. ఇవి కాకుండా డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్ర‌స్టు ద్వారా 170 కేంద్రాలు న‌డుస్తున్నాయ‌ని తెలిపారు. ఈ రెండు ప‌ధ‌కాల కింద ఉచితంగా అందించే డ‌యాల‌సిస్ సేవ‌ల నిమిత్తం 2025-26లో రూ.197.88 కోట్లు వ‌ర‌కు ఖ‌ర్చు చేశామ‌న్నారు స‌త్య కుమార్ యాద‌వ్. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏప్రిల్ నుంచి ఇటీవ‌లి వ‌ర‌కు రూ.90.09 కోట్ల విలువైన డ‌యాల‌సిస్ సేవ‌ల్ని పేద రోగులు పొందారని తెలిపారు.

ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్‌ కార్యక్రమం కింద రాష్ట్రంలో 2019కు ముందు 28 కేంద్రాలు ఏర్పాటయ్యాయని వివ‌రించారు. 2019–24 మధ్య 19 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. 2024–25 నుంచి మరో 14 కేంద్రాలను ఏర్పాటు చేశామ‌న్నారు. వీటికి అదనంగా ఇప్పుడు 22 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. వీటిల్లో ప‌లు కేంద్రాల ఏర్పాటులో న్యాయస్థానంలో విచారణ వంటి కారణాలతో జాప్యం జరిగిందన్నారు. మొత్తం ఈ 22 కేంద్రాల‌ను రోగుల‌కు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అందుబాటులోకి తీసుకు రావాల‌ని స్ప‌ష్టంగా ఆదేశాలు ఇచ్చామ‌న్నారు. ఒక్కొక్క డ‌యాల‌సిస్‌కు ప్ర‌భుత్వం రూ.999 చొప్పున వ్య‌యం చేయ‌నుందని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఒక్కో డయాలసిస్‌ సెషన్‌కు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు ఖర్చవుతుందని చెప్పారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి నెలకు నాలుగైదు సార్లు డయాలసిస్‌ చేయించు కోవాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా రక్తశుద్ధి సేవలు అందుబాటులో ఉండటం బాధిత కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తుందన్నారు స‌త్య‌కుమార్ యాద‌వ్.

Leave A Reply

Your Email Id will not be published!