బకాసుర వధ అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి కటాక్షం

భక్తి భావంతో పరవశించిన తిరుమల..కోలాటాలతో ఆధ్యాత్మిక శోభ

తిరుమ‌ల : భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌. ఈనెల 20వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్స‌వాలు కొన‌సాగుతాయి. పెద్ద ఎత్తున భ‌క్త బాంధ‌వులు త‌ర‌లి వ‌చ్చారు తిరుమ‌ల‌కు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఏర్పాట్టు చేశారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. గజ రాజుల ముందు నడక, మంగళ వాయిద్యాల నాదం, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ప్రబంధ పారాయణం నడుమ వాహన సేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారి కృపా కటాక్షాలు పొందారు.

క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కల్ప వృక్షం కోరిన ఫలాలను ప్రసాదించే దివ్య వృక్షంగా పురాణాలు పేర్కొంటాయి. అటువంటి కల్పవృక్ష వాహనంపై స్వామి వారు దర్శనమివ్వడం భక్తులకు ఐహిక శుభాలు, సకలాభీష్టాల ప్రాప్తికి ప్రతీకగా నిలుస్తుంది. గురువారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈఓ (విద్యా, ఆరోగ్యం) గోపీనాథ్, సీవీఎస్‌వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!