కార్ల త‌యారీకి హైద‌రాబాద్ అనువైన ప్ర‌దేశం : సీఎం

హ్యూందాయ్ ఇండియా సంస్థతో ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు తెలంగాణ గ‌మ్య‌స్థానంగా ఉంద‌న్నారు. ప్ర‌ధానంగా కార్ల తయారీ పరిశ్రమ స్థాపించడానికి హైదరాబాద్ అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి హ్యూందాయ్ ఇండియా సంస్థకు తెలిపారు. తెలంగాణలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. శుక్ర‌వారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రితో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యోన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం దేశంలో మధ్య భాగంలో ఉందన్నారు. దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా, అత్యంత సురక్షితమైనదిగా, జీవించేందుకు అత్యంత అనుకూలమైన నగరంగా గుర్తింపు పొందింది అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివ‌రించారు.

జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ సమగ్ర గ్లోబల్ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. నిమ్జ్‌లో రూ. 8,528 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న హ్యుందాయ్ కేంద్రం ద్వారా మొత్తం 4,276 ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించుకుంది. 678 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. ప్రాజెక్టు పురోగతిని హ్యుందాయ్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వివరించింది. రానున్న కొన్ని నెలల్లో ఈ కేంద్రానికి శంకుస్థాపనకు సిద్ధం చేయనున్నట్టు తెలిపారు.

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు రాష్ట్రం అత్యంత అనుకూలమైన ప్రదేశమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.ప్రత్యేక మొబిలిటీ క్లస్టర్లు, రహదారి, విమాన, రైలు మార్గాల ద్వారా బలమైన రవాణా మౌలిక సదుపాయాలు, భవిష్యత్తులో ఓడరేవులతో హైస్పీడ్ రవాణా అనుసంధానాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలు రాష్ట్రానికి మరింతగా అనుకూలంగా మారుతాయని వివరించారు. తయారీ రంగం అభివృద్ధి కోసం పెరి-అర్బన్ రీజియన్ వంటి ప్రణాళికాబద్ధమైన ప్రాంతీయ అభివృద్ధి నమూనాల ద్వారా తెలంగాణ వేగవంతమైన పారిశ్రామిక విస్తరణకు సిద్ధంగా ఉందని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!