వైఎస్ జగన్ ఓ క్రిమినల్ : చంద్రబాబు నాయుడు
రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న గొడ్డలి పార్టీ
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి రాజకీయ విలువలే కాదు కుటుంబ విలువలు, నైతిక విలువలూ లేవని విరుచుకు పడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడంటూ ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ముసుగులో ఉన్న గొడ్డలి పార్టీ నిరంతరం ఇదే తరహా ఘటనలకు పాల్పడుతోందని ఆరోపించారు. అసత్యాలను పదేపదే ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. బెంగుళూరు నుంచి వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టి వెళ్లి పోవడం తప్పా తను చేసింది ఏమీ లేదన్నారు. ఆ పార్టీకి చెందిన ఓ మాజీ డిప్యూటీ స్పీకర్ ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ ఉందని చెబితే ఆ పార్టీ అధ్యక్షుడు మాత్రం అసత్యాలు చెబుతున్నాడని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు. గత పాలనలో జరిగిన స్థానిక సంస్థల్లో 24 శాతం ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో పనిచేసిన వ్యక్తి అరాచకాలు సృష్టించి ఏకంగా అప్పటి ఎస్ఈసీనే భయపెట్టారని అన్నారు.
అప్పటి ఎస్ఈసీ ప్రాణభయంతో కేంద్రం నుంచి భద్రత తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనేలా చేశాడన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు చంద్రబాబు నాయుడు. 28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీలకు గానూ మొత్తం 51,902 నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. 28 జిల్లాల్లో 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ మొత్తం 5724 నామినేషన్లు దాఖలు అయ్యాయని చెప్పారు. బెంగుళూరు నుంచి వస్తాడు. హిట్ అండ్ రన్ తరహాలో బురద చల్లేసి వెళ్లిపోతున్నాడంటూ ఎద్దేవా చేశారు. తన సొంత మీడియా కెమెరాలను నామినేషన్ల కేంద్రాల వద్ద పెడతానంటాడు ఇదెక్కడి విడ్డూరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇలాంటి క్రిమినల్స్ ను నేనెప్పుడూ చూడలేదని అన్నారు. నేరస్థులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి నానా యాగీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ పార్టీగా వైసీపీ దాడులకు తెగబడింది, హింసకు ప్రేరేపించిందన్నారు.
కూటమి ఎప్పుడూ హింసకు పాల్పడదు, ప్రేరేపించదన్నారు చంద్రబాబు నాయుడు.
