తుపాను ప్ర‌భావం జ‌ర భ‌ద్రం : సీఎం

అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశం

అమ‌రావ‌తి : బంగాళా ఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను ఇది మరింత బలపడి ‘సూపర్ సైక్లోన్’గా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం , ముందస్తు సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ తుపాను కోనసీమ–యానాం–కాకినాడ ప్రాంతాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీనివల్ల కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది . భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని, కొన్ని చోట్ల గాలి వేగం గంటకు 140 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని అంచనా.

27వ తేదీ ఉదయం నుండే తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత మొదలయ్యే అవకాశం ఉందని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. 27 , 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సహాయక చర్యల కోసం రాష్ట్రంలో 10 ఎన్డీఆర్ఎఫ్ (NDRF) , 11 ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఈసంద‌ర్బంగా సీఎంకు వివ‌రించారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి . తుపాను ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల ఏర్పాటు, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ పునరుద్ధరణ వంటి అంశాలపై పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మ‌రో వైపు ఎప్ప‌టిక‌ప్పుడు స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై ఆరా తీస్తున్నారు రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌.

Leave A Reply

Your Email Id will not be published!