స‌ర‌స్ మేళా – 2026లో రికార్డు స్థాయిలో అమ్మ‌కాలు

10 రోజుల ప్ర‌ద‌ర్శ‌న‌లో రూ. 8.24 కోట్లు

విజ‌య‌వాడ : విజ‌య‌వాడ వేదిక‌గా నిర్వ‌హించిన స‌ర‌స్ మేళాకు భారీ స్పంద‌న ల‌భించింది. ఆశించిన దానికంటే ఎక్కువ అమ్మ‌కాలు జ‌రిగాయి. ఈ మేళాలో ఒక్క రోజులోనే ఏకంగా రూ. 1.07 కోట్ల విక్రయాలు జ‌రగ‌డం విశేషం. ఇక‌ 10 రోజుల ప్రదర్శనలో మొత్తం రూ. 8.24 కోట్ల అమ్మకాలు జ‌రిగాయి. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో జరుగుతున్న ‘నేషనల్ SARAS మేళా-2026’కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 24 న ఒక్క రోజే 82,730 ఉత్పత్తుల విక్రయం ద్వారా రూ. 1.07 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ 10 రోజుల ప్రదర్శనలో ఇప్పటి వరకు మొత్తం రూ. 8.24 కోట్ల విలువైన సుమారు 3.60 లక్షల ఉత్పత్తులు అమ్ముడయ్యాయి. 63,000 మందికి పైగా సందర్శకులు ఈ మేళాను సందర్శించారు. దేశ వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసి, విక్రయిస్తున్న ఉత్పత్తుల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనం. మేళాతో పాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకకు మరింత శోభను చేకూర్చాయి.

ముఖ్యంగా గోవాకు చెందిన మహిళా కళాకారులు ప్రదర్శించిన సాంప్రదాయ ‘ఫుగ్డి’ నృత్యం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. లయ బద్ధమైన అడుగులు, సమన్వయంతో కూడిన కదలికలు , కళాకారులు తమ నోటితో చేసే ప్రత్యేకమైన ‘ఫూ’ శబ్దంతో సాగే ఈ జానపద నృత్యం ప్రేక్షకులను అలరించింది. సాధారణ జానపద నృత్యాలకు భిన్నంగా, ఫుగ్డి నృత్యంలో ఎటువంటి సంగీత వాయిద్యాలను ఉపయోగించరు.. నృత్యకారులు తమ కదలికల ద్వారా, నోటితో చేసే శబ్దాల ద్వారానే లయను సృష్టిస్తారు. ఈ ప్రదర్శనకు సందర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. వీటితో పాటు కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్య ప్రదర్శనలు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉన్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను స్టాళ్ల వైపు ఆకర్షించడమే కాకుండా, గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు ప్రదర్శించిన ఉత్పత్తులకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టి, అమ్మకాలు పెరగడానికి దోహద పడ్డాయి. నేషనల్ సారస్ మేళా–2026 ను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, కొత్త వినియోగదారులను చేరుకోవడానికి,తమ మార్కెట్ అవకాశాలను విస్తరించు కోవడానికి ఒక జాతీయ వేదికను కల్పిస్తుంది.

Leave A Reply

Your Email Id will not be published!