తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సహకరించండి : సీఎం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో ప్రత్యేక భేటీ
ముంబై : తెలంగాణ రాష్ట్ర సర్కార్ చేపట్టబోయే తుమ్మడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్ర సర్కార్ సహచరించాలని కోరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సోమవారం సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం మహారాష్ట్రలో పర్యటించింది. ఈ సందర్బంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు వెంబడి ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై కీలక చర్చలు జరిగాయి. బ్యారేజీ ఎత్తు పెంపు, నీటి లభ్యత, వరదల ప్రభావాలు , ఇతర సాంకేతిక అంశాలపై సమగ్రంగా చర్చించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరిస్తూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సమర్పించారు. ఆయన మహారాష్ట్ర ప్రతినిధి బృందం దృష్టికి పూర్వపు ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, గిరిజనుల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుక బాటుతనాన్ని తీసుకు వచ్చారు. గొప్ప చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు గిరిజనులకు, ఆదివాసీ ప్రజలకు చేరలేదని పేరర్కొన్నారు. ఆర్థిక అవకాశాల కొరత, వెనుకబాటుతనం కారణంగా గతంలో నక్సలిజం వంటి సమస్యలకు దారితీసిన పరిస్థితులను వివరించారు. ఆ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు 1975 అక్టోబర్ 6న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగల్ రావు, ఎస్.బి. చవాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం నుంచి… వివిధ దశల్లో జరుగుతున్న ప్రయత్నాలను తెలియ చేశారు. ఐదు దశాబ్దాలుగా ఎన్నో ప్రతిపాదనలు, చర్చలు జరిగాయని గుర్తు చేశారు. అయినప్పటికీ, ఆశించిన పురోగతిని సాధించలేక పోయామని ఆయన అన్నారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయించడానికి 2016లో ఒక ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. అయితే, ఈ ఎత్తులో బ్యారేజీని నిర్మించడం వల్ల తెలంగాణ ప్రాంతపు తాగునీటి, సాగునీటి అవసరాలు పూర్తిగా తీరవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ప్రస్తుత విద్యుత్ అవసరాలు, ఇంధన ఖర్చులు, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్ట్ నిర్వహణ ఖర్చులు కూడా ఒక కీలక అంశమని నొక్కి చెప్పారు. అందువల్ల, గురుత్వాకర్షణ ద్వారా నీటి రవాణాకు ఉన్న అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు .ఈ పరిస్థితులలో, తుమ్మిడిహట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మించడమే అత్యంత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమని ఆయన వివరించారు. తన ప్రజెంటేషన్ ద్వారా, మంత్రి ఈ ప్రతిపాదన సాంకేతిక, కార్యాచరణ, ఆర్థిక కోణాల ప్రాముఖ్యతను వివరంగా తెలియజేశారు. బ్యారేజీ నిర్మాణం కారణంగా మహారాష్ట్రలో వరదల వల్ల ప్రభావితమైన వ్యవసాయ భూములకు నష్టపరిహారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో అమల్లో ఉన్న భూసేకరణ నియమాలు, నష్టపరిహార విధానం ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంతో ఉన్న చారిత్రక సంబంధాన్ని ఆయన ప్రస్తావించారు. పూర్వపు ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా వెనుకబడిన అటవీ ప్రాంతమని పేర్కొన్నారు. అక్కడి గిరిజనులు, ఆదివాసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. కొమరం భీం నేతృత్వంలో జరిగిన ‘జల్, జంగల్, జమీన్’ పోరాటాన్ని ఆయన వారికి గుర్తుచేశారు. ఆ పోరాటం జరిగినప్పటి నుంచి ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు సాగునీరు, తాగునీటి సౌకర్యాల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు.దశాబ్దాలుగా వారి ఆకాంక్షలు నెరవేరలేదని, ఆదిలాబాద్‌లోని గిరిజనులు, ఆదివాసీ ప్రజల జీవితాల్లో వెలుగు నింపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇరు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలని కోరారు. జాతీయ రక్షణ, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆదిలాబాద్ ప్రాంతానికి ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సౌకర్యం అందుబాటులోకి వస్తే, అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఊపు నిస్తుందని ఆయన పేర్కొన్నారు.
దీనివల్ల #మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. ఈ విమానాశ్రయంతో ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు, ఆర్థిక కార్యకలాపాలు, అభివృద్ధి అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ మాత్రమే కాదని, ఇది ఇరు రాష్ట్రాలను భౌతికంగా కలిపే వారధిగా కూడా పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
